తాజాగా జరుగుతున్న పరిణామాలు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అవలంభిస్తున్న విధానాలు.. కేంద్రం తీరు.. వంటివి సరికొత్త చర్చకు దారితీశాయి. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకోవడం.. దీనిపై అనేక ఊహాగానాలు వెలుగు చూడడం.. అదేసమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి.. చకాచకా విమానం ఎక్కేయడం.. వంటివి ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
ఆదివారం ఉదయం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎంలకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అందరికంటే.. ముందుగా శుక్రవారమే.. ఢిల్లీ విమానం ఎక్కేశారు.
ఇక, అప్పటికే షెడ్యూల్ సిద్ధం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆకస్మికంగా.. పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనికి కారణం ఏంటి? అధికారికంగా చూస్తే.. జగన్ కాలు బెణికిందని.. అందుకే.. ఆయనను బెడ్ రెస్ట్ తీసుకోమని.. వైద్యులు సూచించారని.. కాబట్టి.. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అయితే.. దీనికి మరో రీజన్ ఢిల్లీలో వినిపిస్తోంది.
కేంద్ర మంత్రులు.. నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి షెకావత్, అదేసమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్లను జగన్ వారం నుంచి అడుగుతున్నారని.. అయితే.. వీరిలో ఎవరూ కూడా జగన్‌కు అప్పాయింట్మెంట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదని. దీంతోనే జగన్ వెనక్కి తగ్గారని ప్రచారం జరుగుతోంది. దీనినే.. ప్రధాన మీడియా ప్రచారం చేసింది. మరి దీనికి కారణాలేంటి? ఒకవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ వెళ్లీ వెళ్లడంతోనే… మంత్రి షెకావత్‌తో భేటీ కావడం.. సంచలనంగా మారింది.
ఆయన ఇరు రాష్ట్రాల జల సంబంధాలపైనా, ప్రాజెక్టులపైనా చర్చించారు. ఇక, అమిత్ షా అప్పాయింట్ మెంట్ కూడా ఖరారైనట్టు తెలిసింది. మరి.. ఏపీసీఎం కు ఎందుకు అప్పాయింట్ మెంట్ లభించలేదు..? అనేది ప్రశ్న.
దీనికి ఏపీ అంటే.. కేంద్రం పెదవివిరుస్తోందని.. ప్రతిసారీ.. అప్పులు.. అప్పులు అంటూ.. అభ్యర్థనలు తప్ప.. మరేమీ చర్చించేందుకు లేవని.. భావిస్తోందని.. ఇప్పటికే.. అన్ని రకాలుగా అప్పులు చేసుకునేందుకు అకవాశం ఇచ్చినా.. ఇంకా ఇంకా అప్పుల కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని.. అందుకే.. విసుగు పుట్టిన కేంద్రం.. ఆయనకు అప్పాయింట్మెంట్ ఇచ్చేందుకు సుముఖత చూపలేదని అంటున్నారు. మరి ఇది నిజమేనా? ఒకవేళ ఇదే నిజమైతే.. రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవనే అంటున్నారు పరిశీలకులు.