తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ వ్యవహారాలు రోడ్డున పడుతున్నాయి. ఇటీవల హరీష్ రావు వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారి.. తాను స్వయంగా వివరణ ఇచ్చుకునే వరకు వచ్చింది. అంతేకాదు.. నేరుగా ఆయన పార్టీ చీఫ్ కేసీఆర్‌ను కలుసుకుని సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ వ్యవ హారం తాలూకు.. రాజకీయ సెగలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంతలోనే కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కూడా తీవ్రంగా మారింది.
ఆమెపై సొంత పార్టీ నాయకులే విమర్శలు చేయడం.. వీటి వెనుక మరో కీలక నాయకుడే ఉన్నారన్న ప్రచారం ముందుకు రావడం తెలిసిందే. ఇదిలావుంటే.. ఇప్పుడు కవిత తన తండ్రి, పార్టీ సుప్రీం కేసీఆర్‌కు పలు ప్రశ్నలతో కూడిన సంచలన లేఖను విడుదల చేశారు. అయితే.. ఇది ఎప్పుడు రాశారన్నది తెలియకపోయినా.. తాజాగానే ఆమె రాసినట్టు సమాచారం. దీనిలో పార్టీ ప్లీనరీ సమయంలో కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని నిశితంగా విమర్శిస్తూ.. పలు వ్యాఖ్యలు, ప్రశ్నలు ఉన్నాయి.
బీజేపీని గట్టిగా కేసీఆర్ విమర్శించకపోవడాన్ని, కేంద్రంలోని మోడీ సర్కారును నిలదీయక పోవడాన్ని కవిత ప్రశ్నించారు. ఇలా చేసి.. బీజేపీతో బీఆర్ ఎస్ ఎప్పుడైనా పొత్తుకు వెళ్లే సంకేతాలు ఇచ్చినట్టు చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు కాంగ్రెస్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్న దరిమిలా.. ఇప్పుడు సొంత కుమార్తె కూడా అదే బాటన నడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్లాస్టిక్ కత్తితో దాడి చేసినట్టుగా వ్యవహరించారని.. దీనిలో `సర్దుకుపోయే` లక్షణం కనిపించిందని పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నామరూపాల్లేకుండా చేసి.. మార్చిన వైనంపై పార్టీ అధినేతగా ప్రశ్నించక పోవడం ఎవరికీ రుచించలేదని కవిత మండిపడ్డారు. దీనిని కార్నర్ చేస్తూ.. ఆమె తీవ్ర వ్యాఖ్యలతోనే ప్రశ్నలు సంధించారు.
ప్రధానంగా మైనారిటీ వర్గాలు వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్టంపై పార్టీ లైన్‌ను ఎందుకు చెప్పలేదన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రశ్నించలేకపోయారని అన్నారు. అదేవిధంగా.. బీఆర్ ఎస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేకపోయారని ఎద్దేవా చేసిన కవిత.. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని పూర్తిగా విస్మరించినట్టు ప్లీనరీ స్పష్టమైన సంకేతాలు పంపించడం పార్టీకి మేలు చేయబోదని అన్నారు.
మరో కీలక వ్యవహారాన్నికూడా కవిత ప్రస్తావించారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ కోటా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎందుకు పోటీ చేయలేదో చెప్పలేదన్నారు. అంతేకాదు.. ఇలా చేయడం ద్వారా బీజేపీకి మేలు చేసేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నించిందన్న భావనను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం కాంగ్రెస్‌కు ఇచ్చినట్టు అయిందని తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మరి దీనిపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.