నెల్లిమర్లలో జరిగిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సభలో ప్రసంగించిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ 175 కు 175…. 25కు 25 స్థానాలు గెలుస్తానని చెబుతున్నాడని, అయితే కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని నెల్లిమర్ల నుంచి జగన్ కు సవాల్ విసురుతున్నానని అన్నారు. వై కాంట్ పులివెందుల అంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ ముఖం పెట్టుకుని జగన్ పులివెందులలో ఓట్లు అడుగుతాడని నిలదీశారు.
బాబాయిని చంపావని ఓట్లు అడుగుతావా? గొడ్డలి పంపిస్తానని ఓటు అడుగుతావా అని చురకలంటించారు .రుషికొండను జగన్ మింగేసాడని అప్పలనాయుడు ఆయనను ఆదర్శంగా తీసుకున్నాడని ఎద్దేవా చేశారుని అన్నారు. సీఎంను విమర్శిస్తే పోలీసులు గోడ దూకి వచ్చి అరెస్టు చేస్తారని, దేవుడి విగ్రహం తల తీస్తే మాత్రం ఒక్క మాట మాట్లాడారంటూ పోలీసులపై విమర్శలు గుప్పించారు. ఆ విషయంపై ప్రశ్నించిన తనను బొక్కలో వేస్తామన్నారని, కేసులు పెడతారని, తన మీదున్న 22 కేసుల్లో అది కూడా ఒకటని అన్నారు. అని ఇది తుగ్లక్ పరిపాలనా అని ఎద్దేవా చేశారు. తాను ఉండి ఉంటే భోగాపురం విమానాశ్రయం పూర్తయి ఉండేదని చెప్పారు.
మరోవైపు, తొలిసారి చంద్రబాబు, పవన్ సంయుక్తంగా ఓ జాతీయ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు యథాతధంగా…
ఎన్డీటీవీ: ఏపీలో ఎన్డీయే కూటమి పరిస్థితి ఎలా ఉంది?
పవన్ కల్యాణ్: ఏపీలో ప్రభుత్వం మారబోతోంది. వైసీపీ ఓడిపోబోతోంది… ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడికైనా వెళ్లండి… ఇవాళ నెల్లిమర్లలో కనిపించే జనఘోష ప్రతి చోటా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారన్న విషయం ఈ జనాలను చూస్తే అర్థమవుతుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మేం ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నాం.
ఎన్డీటీవీ: కూటమి కార్యరూపం దాల్చింది… మీరు (చంద్రబాబు), పవన్ కల్యాణ్ కలిశారు… ఇది అరుదైన ఘట్టం అనుకుంటున్నారా?
చంద్రబాబు: అవును, మా కలయిక అత్యంత అరుదైనది. ప్రజల్లో సంపూర్ణ విప్లవం కనిపిస్తోంది. మే 13న ఆ విషయాన్నే మనం చూడబోతున్నాం. తగినంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఎన్డీటీవీ: ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పాత్రను ఎలా చూస్తారు?
చంద్రబాబు: నేను ఇతర పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్థానం లేదు. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
ఎన్డీటీవీ: ఏపీలో కాంగ్రెస్ కు స్థానం లేదంటున్నారు… ఈ ఎన్నికల యుద్ధంపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి?
పవన్ కల్యాణ్: నా వరకు ఈ ఎన్నికలు ప్రధానంగా జవాబుదారీతనం కోసం చేస్తున్న పోరాటం. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. రాష్ట్రంలో అనేక రూపాల్లో అరాచకం నెలకొంది. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై ముఖ్యమంత్రి కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. అందుకే మేం ఈ ఎన్నికలను ప్రభుత్వాన్ని గద్దె దింపే యుద్ధంగా చూస్తున్నాం.
ఎన్డీటీవీ: మీరు రాష్ట్రంలో చాలా ముఖ్యమైన కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం గతంలో జగన్ రెడ్డి వైపు మళ్లింది కదా? ఈసారి మీరు ఇక్కడ ఏ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతున్నారు?
పవన్ కల్యాణ్: ఇక్కడ గతంలో మంచి బేరం కుదిరింది… అంతేతప్ప ఈ నియోజకవర్గం జగన్ రెడ్డి వైపు మళ్లింది అనడం సరికాదు. దుష్ట పాలన కారణంగా ఈసారి ఆ పరిస్థితి ఉండదు. ప్రజలు మావైపే నిలుస్తారు.
ఎన్డీటీవీ: ప్రధాని మోదీ కూడా ఏపీ వస్తున్నారా?
చంద్రబాబు: ఆయన త్వరలోనే వస్తారు.