ప్రస్తుతం ఆషాడ మాసం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆషాడం అంటే తెలుగు సంవత్సరాదిలో మూఢం. అందువల్ల ఆషాడ మాసంలో శుభకార్యాలు, మరీ ముఖ్యంగా వివాహాలు అస్సలు జరిపించరు. అలాగే కొత్త అల్లుళ్లు మరియు కోడళ్లు అత్తారింట్లో ఉండరు. ఏమైనా మంచి పనులు ప్రారంభించడానికి కూడా ఆషాడ మాసం సరైనది కాదని భావిస్తారు. అలాంటి ఈ ఆషాడ మాసంలోనే అపర కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి వివాహం జరిపించారు.
జూలై 12న ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చింట్ తో అనంత్ ఏడడుగులు వేశారు. ఒకటా రెండా ఎన్నో వింతలు, విశేషాలతో వీరి వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, క్రీడా, సినీ, విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు వచ్చి అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో సందడి చేశారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఆషాఢంలో పెళ్లి చేయడమేంటి అనే డౌట్ తెలుగు వారిలో చాలా మందికి ఉంది. అయితే తాజాగా ఆ సీక్రెట్ బయటపడింది. దక్షిణ భారతదేశం పాటించే పంచాంగానికి మరియు ఉత్తర భారతదేశం పాటించే పంచాంగానికి కొంత తేడా ఉంటుంది. తెలుగు వారంతా అనుసరించేది చాంద్రమాన పంచాంగం కాగా.. ఉత్తరాది వారు సూర్యమాన పంచాంగాన్ని అనుసరిస్తారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి ముహూర్తాన్ని సూర్యమాన పంచాంగం ప్రకారమే పండితులు నిర్ణయించారు. సూర్యుడి కదలికల ఆధారంగా రూపొందించబడిన ఈ పంచాంగంలో అధిక మాసం ఉండదు. అందువల్ల తిధులు, ముహూర్తాల విషయంలో ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం మనకు ఆషాఢ మాసమే. కానీ ఉత్తరాది వారికి దానితో సంబంధం లేదు. అందుకే ముఖేష్ అంబానీ ఒక శుభ ముహూర్తాన్ని చూసి అనంత్ అంబానీ విహాన్ని జరిపించారు.