రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఉండొచ్చు.. వాద ప్రతివాదాలు ఉండొచ్చు.. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో మాత్రం.. సఖ్యత ఉండాలి. – ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న సూత్రం. మంచిదే. ఎవరైనా పొరుగు రాష్ట్రాలతో కయ్యం పెట్టుకోమని గానీ, కేంద్రంతో కాలు దువ్వమని కానీ.. కోరుకోరు. అయితే.. అన్ని విషయాల్లోనూ మౌనమే సమాధానం.. అనేది ఎంత వరకు సమంజసం ? అనేది ఇప్పుడు ప్రధానంగా తెరమీదికి వస్తున్న ప్రశ్న. రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పడిన కొత్తల్లో అయితే.. పోనీలే.. ముందు ముందు.. ఇరుగు పొరుగు రాష్ట్రాలు సహకరిస్తాయి.. కేంద్రం కూడా చేయి అందిస్తుంది అని అనుకున్నారు.
కానీ, ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల దూకుడు మామూలుగా లేదు. కేంద్రం నుంచి సహకారమూ అంతంత మాత్రంగానే ఉంది. విభజన హామీల అమలు అసలే లేదు. మరి ఇప్పటికైనా.. జగన్ మౌనం వీడుతున్నారా? అంటే.. అది కనిపించడం లేదు. ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. వచ్చిన సమస్యలు.. లేదా.. దీనికి ముందున్న సమస్యల పరిష్కారం విషయాన్ని పక్కన పెడితే.. విభజన తాలూకు.. నిర్ద్వంద్వంగా అమలు చేయాల్సిన.. అటు కేంద్రం.. ఇటు దాయాది రాష్ట్రం తెలంగాణ ఇవ్వాల్సిన నిధుల విషయంలోనూ జగన్ సుదీర్ఘ మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది.
ఏపీ విభజన సమయంలో నవ్యాంధ్ర 16 వేల లోటు బడ్జెట్‌తో ఉంది. అయితే.. దీనిని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రం తీసుకుంది. కానీ, అనేక కొర్రీలు వేసిన దరిమిలా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడగ్గా.. అడగ్గా.. మొత్తంగా మీ ద్రవ్య లోటు.. 7 వేల కోట్లు మాత్రమే నని తేల్చేశారు. దీనిలో అతి కష్టం మీద.. చంద్రబాబు.. 4 వేల కోట్లు రాబట్టుకున్నారు. మరి మిగిలిన సొమ్ము పరిస్థితి ఏంటి? మరో 3 వేల కోట్ల రూపాయాలు ఏపీకి రావాల్సి ఉంది. ఇదేమీ ఊరికేనే వచ్చేది.. కేంద్రం దయదలిచి రాల్చేదీ ఎంత మాత్రం కాదు. ఏపీకి హక్కుగా సంక్రమించింది. అవసరమైతే.. న్యాయపోరాటానికి కూడా వీలు కల్పించేదే!
అయినప్పటికీ.. జగన్ మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ హక్కుగా రావాల్సిన సొమ్మును అడగకుండా.. చీటికీ మాటికీ.. అప్పుల కోసం.. ఢిల్లీలో క్యూ కడుతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం జంకే వడ్డీలను కట్టేందుకు ఎగబడుతున్నారనే వాదన ఉంది. ఇక, తెలంగాణ విషయాన్ని తీసుకుంటే.. దాదాపు 4200 కోట్ల రూపాయలను విద్యుత్ బకాయిల కింద చెల్లించాల్సి ఉంది. ఇది కూడా దయాధర్మం కాదు. అయినప్పటికీ.. జగన్ అడగడం లేదు. ఇక, తాజాగా తెలుగు అకాడమీ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని.. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విభజన చట్టంలో ఉన్న స్థిరాస్తుల్లోనూ తమకు వాటా వస్తుందని తెలిసినా.. ఏపీ ఇన్నాళ్లుగా మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటు.. ఉమ్మడి సచివాలయ భవనాల విషయంలోనూ ఏపీకి వేల కోట్ల ఆస్తులు రావాల్సి ఉంది. దీనిని అడిగే దిక్కులేకుండా పోయింది. మరి ఇలా అటు కేంద్రం నుంచి ఇటు.. తెలంగాణ నుంచి కూడా రావాల్సిన అడగకపోతే.. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అనేది ప్రజల టాక్?! ఇదే వ్యవహారం ఇలానే సాగితే.. ఏపీలో ప్రభుత్వాలకే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. జగన్ మౌనం వీడుతారా? అయితే.. చర్చలు, లేకుంటే..న్యాయ పోరాటం ద్వారా అయినా.. మన నిధులు మనకు రాబడతారా? అనేది చూడాలి.