కష్టాలు మామూలు మనుషులకే కానీ.. అత్యుత్తమ స్థానంలో ఉన్న వారికి.. అపరిమితమైన అధికారాలు ఉన్న వారి దరి చేరవని చాలామంది నమ్ముతుంటారు. కానీ.. కాలం మహా సిత్రమైంది. ఎవరైనా.. ఎంతటి బలవంతుడైనా.. ప్రతి ఒక్కరికి తమదైన టైం ఉంటుంది. ఆ సమయాన ఎంతైనా మాట్లాడేస్తారు. కానీ.. ఒక్కసారి టైం తేడా కొడితే చాలు.. ఎంతటివారైనా సరే తగ్గాల్సిందే. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
కరోనా వేళ.. ఆయన పని తీరు ఏ మాత్రం బాగోలేదని.. అగ్రరాజ్యంలో భారీగా చోటు చేసుకున్న కరోనా మరణాలకు ట్రంప్ ప్రభుత్వ వైఫల్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా వచ్చిన అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని.. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలని ట్రంప్ తపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తెర తీయటమే కాదు.. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు రచ్చ రచ్చగా మారటం ఖాయమన్న మాట వినిపించేలా ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా ట్రంప్ కరోనా బారిన పడటంతో.. కీలకమైన ఎన్నికల వేళ ప్రచారాన్ని ఎవరు చేపడతారు? అన్నది ప్రశ్నగా మారింది. ట్రంప్ ఆసుపత్రికే పరిమితం కావటం.. ప్రజల మధ్యకు రావటానికి మరింత టైం పడుతుందని చెబుతున్నారు. మరి.. ముంచుకొస్తున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ఎవరు చేపడతారు? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.
దీనికి సమాధానంగా ట్రంప్ పెద్ద కుమారులు ట్రంప్ జూనియర్.. ఎరిక్ ట్రంప్ లు ప్రచార బాధ్యతలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ కు తోడుగా వీరు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆపరేషన్ మాగా పేరుతో (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) నినాదంతో ప్రచారం సాగుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా ఆసుపత్రి పాలైన ట్రంప్ పై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయమని ఆయన ప్రత్యర్థి.. కమ్ డెమెక్రాట్ల అభ్యర్థి బైడెన్ పేర్కొన్నారు. అయితే.. ఆయన కరోనా మరణాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఆయన తప్పు పట్టటం గమనార్హం.