గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జన్యుపరంగా చాలాసార్లు పరివర్తనం చెందిన ఈ ప్రాణాంతక వైరస్….ఇపుడు తాజాగా మరో ప్రమాదకరమైన వేరియంట్ గా అవతరించింది. కరోనా వైరస్ లో ‘లాంబ్డా’ అనే తాజా వేరియంట్ ప్రపంచాన్ని కుదిపేసే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా వార్నింగ్ ఇచ్చింది.
లామ్డా వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల్లో విస్తరిస్తోన్న నేపథ్యంలో దానిని ‘దృష్టిసారించాల్సిన వైరస్ రకం’ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్)గా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) కూడా లామ్డా వేరియంట్ ను ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్ ప్రొటీన్‌లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉండడంతో దీనిపై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
కరోనా కొత్త స్ట్రెయిన్ తొలుత విరుచుకుపడిన బ్రిటన్‌లో ఇప్పటివరకూ 6 లాంబ్డా కేసులు వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ కూడా యూకే నుంచి మొదలై ప్రపంచాన్ని కుదిపేసింది. లామ్డా కూడా అదే తరహాలో విస్తరించే అవకాశమున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత ఏడాది ఆగస్టులో పెరూలో కనిపించిన లామ్డా…. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది.
పెరూలోని కరోనా కేసుల్లో లామ్డా వేరియంట్ కేసులు 81 శాతం ఉన్నాయి. అయితే, లామ్డా వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి గానీ, అందుబాటులో ఉన్న టీకాలకు ఇది లొంగదనిగానీ ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్ఈ పేర్కొంది. కానీ, దీని స్పైక్ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది శరవేగంగా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.