మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. కృషి, పట్టుదల, ప్రతిభతో సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగారు. దేశం గర్విందగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సుధీర్గ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. అటువంటి చిరంజీవికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి ఓ చిత్రం ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.. `సింహాద్రి`.
తాజాగా ఈ విషయాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రివీల్ చేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచస్థానికి చాటి చెప్పడమే కాకుండా భారత్ కు ఆస్కార్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును తెచ్చిన దర్శకధీరుడు రాజమౌళిపై ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ `మోడ్రన్ మాస్టర్స్` పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు రాజమౌళి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలోనే రాజమౌళి తీసిన సింహాద్రి చూసి తన తండ్రి చిరంజీవికి మైండ్ బ్లాక్ అయిపోయిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. మగధీర స్టార్ట్ చేయడానికి ముందు చిరంజీవి సింహాద్రి మూవీని చూశారట. రాజమౌళికి అది రెండో సినిమా.. అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా తీయడంతో మెగాస్టార్ వంటి సీనియర్ నటుడే విస్మయానికి గురయ్యారట. అసలు కొన్ని నిమిషాల చిరంజీవికి నోట మాట రాలేదట. రాజమౌళి పనితనం ఆయన్ను అంతలా మెప్పించిందని చరణ్ తెలియజేశారు.
ఇకపోతే సింహాద్రి సినిమాను రాజమౌళి ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో.. ఎన్టీఆర్ కూడా అంతే అద్భుతంగా నటించాడు. భూమిక, అంకిత హీరోయిన్లుగా చేశారు. వి. విజయేంద్ర కుమార్ నిర్మించిన సింహాద్రి 2003 జూలై 9న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ. 8.5 కోట్లు పెట్టుబడి పెడితే.. ఫుల్ రన్ లో రూ. 26 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు తిరగరాసింది. ఎన్టీఆర్, రాజమౌళిలకి భారీ స్టార్డమ్ అందించింది. సింహాద్రి విడుదల తర్వాత అప్పటికి నెం. 1 స్థానంలో ఉన్న చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చేవాడు వచ్చాడంటూ ఎన్టీఆర్ పై పలు మీడియా సంస్థలు కథనాలు కూడా రాయడం విశేషం.