గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 29 అసెంబ్లీ స్థానాలను ఆ రెండు పార్టీలకు కేటాయించింది. అలాగే టీడీపీలో కొత్త వారికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఫలితంగా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు తమ టిక్కెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో పలు రాజకీయ సమీకరణాలతో గత ఎన్నికల్లో తమ సీటు త్యాగం చేసిన వారికి, పార్టీ కోసం అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యం కల్పించింది. దాంతో మాజీమంత్రి కేఎస్ జవహర్, మలేపాటి సుబ్బనాయుడు, మాజీమంత్రి పీతల సుజాత, డాలర్ దివాకర్‌రెడ్డి తదితరులు పదవులు అందుకున్నారు. కానీ ఈ జాబితాలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు లేకపోవడం ఆయన అభిమానులను, అనుచరులను కలవరపాటుకు గురి చేసింది.
టీడీపీ సీనియర్ నేతల్లో దేవినేని ఉమా ఒకరు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతగా కూడా ఆయనకు పేరుంది. ఇతర నాయకుల మాదిరిగా పార్టీలను మార్చే సంస్కృతి ఆయనది కాదు. దివంగత మంత్రి, టీడీపీ నేత దేవినేని వెంకటరమణ సోదరుడిగా దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లోనూ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్న దేవినేని ఉమా.. ఆ తర్వాత మైలవరం నియోజకవర్గానికి మారి 2009, 2014లో టీడీపీ టికెట్ పై గెలిచారు.
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా మరియు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగానూ పని చేశారు. 2024 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయాలని దేవినేని భావించారు. కానీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కోసం ఆయన తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. చంద్రబాబు అభ్యర్థన మేరకు వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం కూడా దేవినేని ఉమా కృషి చేశారు.
కానీ ఇంత వరకు ఆయన త్యాగానికి తగ్గ ఫలితం దక్కలేదు. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో సైతం టీడీపీ అధినాయకత్వం దేవినేని ఉమాకు అవకాశం కల్పించలేదు. తెలుగు దేశం పార్టీలో దేవినేని ఉమా మోస్ట్ సీనియర్ నేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున ఆయన బలమైన వాయిస్ వినిపించారు. అటువంటి నేతకు ఇంతవరకు సరైన గుర్తింపు దక్కకపోవడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉమా మాత్రం కూల్‌గానే ఉన్నారట. వచ్చే ఏడాది భారీ ఎత్తున ఎమ్మెల్సీల భర్తీ జరగనుంది. ఆ సమయంలో దేవినేనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి పెద్దల సభకు పంపనున్నట్లు అధిష్టానం నుంచి హామీ వచ్చిందట. ఆ కారణంగానే ఆయన తన పొలిటికల్ కెరీర్ పై ధీమాగా ఉన్నారని టాక్ నడుస్తోంది.