టాలీవుడ్లో రెండు దశాబ్దాలకు పైగా చక్రం తిప్పుతున్న నిర్మాత దిల్ రాజు. ఆయన నిర్మాతగా మారాక చాలా ఏళ్ల పాటు తనకున్న సక్సెస్ రేట్ ఇంకే నిర్మాతకూ లేదు. క్వాంటిటీ, క్వాలిటీ రెండింట్లోనూ ఆయన ఎవ్వరూ అందుకోలేని స్థాయికి ఎదిగారు. అలా చాలా ఏళ్ల పాటు వైభవం చూసిన దిల్ రాజుకు కొన్నేళ్లుగా అస్సలు కలిసి రావడం లేదు. ఇటు ప్రొడక్షన్లో, అటు డిస్ట్రిబ్యూషన్లో ఆయన ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు.
రాజు నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఇద్దరి లోకం ఒకటే, జాను, వి, షాది ముబారక్, రౌడీ బాయ్స్, ఎఫ్-3, థ్యాంక్యూ, ఫ్యామిలీ స్టార్.. ఇలా ఆయన డిజాస్టర్ల జాబితా పెద్దదే. వకీల్ సాబ్, వారిసు ఓ మాదిరిగా ఆడాయి. అవి కూడా పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి.
లేటెస్ట్గా రాజు నుంచి ‘లవ్ మి’ మూవీ వచ్చింది. ఇది ఆయన అన్న కొడుకు శిరీష్ హీరోగా నటించిన సినిమా. ‘బేబి’తో మంచి క్రేజ్ సంపాదించిన వైష్ణవి చైతన్యను హీరోయిన్గా పెట్టుకున్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి లాంటి లెజెండరీ టెక్నీషియన్లను సెట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రోమోలు కూడా ఇంట్రెస్టింగ్గా కనిపించాయి. బాక్సాఫీస్ స్లంప్‌లో ఉన్న టైంలో రిలీజైనా తొలి రోజు థియేటర్లకు జనం బాగానే వచ్చారు.
కానీ సినిమాకు టాక్ మాత్రం బాలేదు. ప్రోమోల్లో ఉన్నంత క్యూరియాసిటీ సినిమాలో లేకపోయింది. అన్ కన్విన్సింగ్ కాన్సెప్ట్, కన్ఫ్యూజింగ్ నరేషన్ సినిమాకు చేటు చేశాయి. ఓవరాల్‌గా ‘లవ్ మి’ రిజల్ట్ ఆశాజనకంగా ఉండేలా కనిపించట్లేదు. కథ విన్నా, ఫస్ట్ కాపీ చూసినా సినిమా రిజల్ట్ చెప్పేస్తాడని.. ‘జడ్జిమెంట్ కింగ్’ అని పేరున్న దిల్ రాజు.. ఈ సినిమాను ఇలా ఎలా బయటికి వదిలేశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆయన జడ్జిమెంట్ స్కిల్స్‌పై ఆల్రెడీ ‘ఫ్యామిలీ స్టార్’ లాంటి చిత్రాలు సందేహాలు నెలకొనేలా చేశాయి. ఇప్పుడు ‘లవ్ మి’ ఆ సందేహాలను ఇంకా పెంచేలా ఉంది. రాజుకు పట్టిన ఈ గ్రహణం ఎప్పటికి వీడుతుందో మరి.