ఇవాళ తెలుగుదేశం పార్టీ మహిళా నేత, శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గ ఇంఛార్జి గౌతు శిరీష పుట్టినరోజు. రాజకీయాలలో ఆటుపోట్లు ఎన్ని ఉన్నా ఆ కుటుంబం మాత్రం ప్రజా క్షేత్రాన్ని వీడలేదు. గెలుపు, ఓటమి అన్నవి పట్టింపు లేకుండా పనిచేసింది. ఆ కుటుంబానికి పలాసలోనే కాదు ఉత్తరాంధ్ర లోనే మంచి పేరుంది. ప్రతిష్ట ఉంది. గౌతు కుటుంబం అంటే ఓ మేలిమి తరహా రాజకీయం చేస్తారన్న గుర్తింపు కూడా ఉంది. అవే ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాయి. చిరకాలం రాజకీయాల్లో ఉన్న గౌతు శ్యామ సుందర శివాజీ అమ్మాయిగా శిరీష గుర్తింపు పొందారు. రాజకీయాల్లో రాణించేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా వైసీపీ తప్పిదాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ఉన్నారు. పలాస కేంద్రంగా మంత్రి సీదిరి పై పోరాడుతూ, ఓ విధంగా తన శక్తికి మించి పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఆ రోజు 2014 – 19 మధ్య కాలంలో పనిచేసినా, ఇప్పుడు పలాస నియోజకవర్గ పరిధిలో ఇంఛార్జ్ గా ఉన్నా భర్త వెంకన్న చౌదరి ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో మరో తమ్ముడు కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో కదం తొక్కుతున్నారు.
వాస్తవానికి కుటుంబ పరంగా స్నేహాలే ఆ రెండు నియోజకవర్గాలకూ ఎంతో కీలకం. అటు టెక్కలి అయినా ఇటు పలాస అయినా సత్వరమే స్పందించే లక్షణం అచ్చెన్నకూ ఉంది. ఎంపీ రామ్మోహన్ నాయుడికీ ఉంది. అందుకే బాబాయి అచ్చెన్న అంటే గౌతు శిరీష కూడా ఎంతో గౌరవిస్తారు. ఓ విధంగా గౌతు కుటుంబం అంటే కింజరాపు కుటుంబానికే ఓ పెద్ద దిక్కు. అదే సమయంలో ఇరు కుటుంబాలూ కలసి రాజకీయ రణ రంగంలో కలిసి పనిచేసిన రోజులున్నాయి. ఎర్రన్ననూ, శివాజీనీ ఉద్దానం బ్రదర్స్ అని పిలిచేవారు. దిగ్గజ నేతలుగా పేరున్న ఎర్రన్నాయుడు కానీ శివాజీ కానీ ఏ రోజూ తగాదాలు పడిన సందర్భాలే లేవు.అందుకే అక్కకు ఏ కష్టం వచ్చిన వెంటనే అండగా నిలిచి ప్రత్యక్ష పోరుకు కదలిన సందర్భాల్లో ఎంపీ రామూ జీవితంలో ఎన్నో !
ముఖ్యంగా ఉద్దానం వాకిట ఎంపీ రామూకు ఎంతో పేరుంది. కార్యకర్తలు ఆయన కోసం శ్రమ అని భావించకుండా శక్తి వంచన లేకుండా పనిచేస్తారు. రామూ ప్రాతినిధ్యం వహించే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే పలాస వస్తుంది. కనుక ఈ ప్రాంత సమస్యలు, జీడి రైతుల సమస్యలు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ కూడా పార్లమెంట్ వరకూ తీసుకుని పోయి రామూ మాట్లాడతారు. ఆ విధంగా మంత్రి సీదిరికి కూడా గట్టి పోటీ ఇస్తుంటారు. అందుకే అక్క ఏం చెప్పినా వెను వెంటనే స్పందించి సంబంధిత వర్గాలతో మాట్లాడతారు.
తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ ఉద్దానంలో ఆ రోజు ఎర్రన్న, శివాజీ ఎలానో ఈ రోజు ఈ అక్కాతమ్ముళ్లు అలా అన్న విధంగా ఆత్మీయ అనుబంధం కొనసాగిస్తున్నారు. శిరీష జన్మదినం సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే…”సోదరి గౌతు శిరీష గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యలపై మీరు చేస్తున్న పోరాటం మహిళా నాయకత్వానికి స్పూర్తిదాయకం. పోరాటానికి పేరొందిన గౌతు వారు అనడానికి మీరే నిదర్శనం మరియు భవిష్యత్తులో పోరాటపటిమలో గౌతు కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను..”అంటూ ఆత్మీయ సందేశం ఎఫ్బీలో పోస్టు చేశారు.