సుమారు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా `దేవర` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 29న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గత ఆదివారం(సెప్టెంబర్ 22) రాత్రి హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు పాస్‌లను జారీ చేశారు.
కానీ ఈ ఇండోర్ ఈవెంట్‌కు అంచనాలకు మించి వేలాదిగా అభిమానులు, ప్రేక్షకులు తరలివచ్చారు. నోవాటెల్ హోటల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గేట్లు కిక్కిరిసిపోయాయి. పాసులు తీసుకున్న చాలా మంది హోటల్ బయటే నిలిచిపోయారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చేసేదేమి లేక చివరి క్షణాల్లో దేవర మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఈవెంట్ రద్దవడంతో ఆగ్రహావేశాలకు గురైన అభిమానులు రెచ్చిపోయారు. హోటల్ లోని ఫర్నిచర్, కుర్జీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. జనాల తోపులాటలో హోటల్ లోని మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు కూడా బ్రేక్ అయ్యాయి. దాంతో భారీ నష్టం వాటిల్లింది. ఇక తాజాగా నష్టాన్ని అంచనా వేసిన నోవాటెల్ హోటల్ యాజమాన్యం.. రూ. 33 లక్షలని లెక్కలు తేల్చింది. ప్రధానంగా కుర్చీలకే రూ.7లక్షల వరకు నష్టం ఏర్పడినట్లు తెలుస్తుండగా.. తలలు పట్టుకోవడం దేవర నిర్మాతల వంతైంది. నష్టాన్ని చెల్లించాలని నోవాటెల్ యాజమాన్యం కోరడంతో.. బిల్లు కొంచెం తగ్గించాలని ప్రొడ్యూసర్స్ బేరాలు మొదలుపెట్టడం గమనార్హం.