కలిసిగట్టుగా రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీడీపీ అధిష్టానం పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడే ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. నంద్యాల టీడీపీలో సైతం ఇదే పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూటమి వేవ్ లో భాగంగా నంద్యాల ఎంపీ అయ్యారు బైరెడ్డి శబరి. ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె మరియు మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన బైరెడ్డి శేషశయన రెడ్డి మనవరాలు.
అయితే ఆది నుంచి శబరి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పైగా జిల్లా ఎమ్మెల్యేలను ఆమె లెక్క చేయరు అన్న టాక్ బలంగా ఉంది. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలతో ఆమెకు వైరం కూడా ఏర్పడింది. ముఖ్యంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయ సూర్య, శబరి మధ్య వివేధాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనం. నందికొట్కూరు బైరెడ్డి ఫ్యామిలీకి సొంత నియోజకవర్గం. అక్కడ పట్టు సాధించాలని వారు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే నందికొట్కూరు రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో బైరెడ్డి కుటుంబానికి అక్కడ పోటీ చేసే ఛాన్స్ దక్కడం లేదు. అనూహ్యంగా బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా విజయం సాధించారు. దాంతో సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులో పట్టు బిగించాలని చూస్తున్నారు. అది స్థానికి ఎమ్మెల్యేకి ఏమాత్రం నచ్చట్లేదు. ఇదే తరుణంలో ప్రభుత్వం నందికొట్కూరులో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. మంతి అనిత ఆదేశాలు మేరకు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఇటీవలె జరిగింది.
భూమి పూజ చేసే ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలను అధికారులు ఆహ్వానించారు. ముందుగా హాజరైన ఎమ్మెల్యే జయ సూర్య.. ఎంపీ శబరి రాకుండానే అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన శబరి.. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వెళ్లిపోవడంతో ఖంగుతిన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తాను వచ్చే వరకు ఎమ్మెల్యే ఎందుకు ఆగలేదంటూ అధికారులపై చిందులు తొక్కారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పక్కనే శబరి మళ్లీ శంకుస్థాపన చేశారు. ఈ సంఘటనతో నంద్యాల టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. మరి ఎమ్మెల్యే వర్సెస్ లేడీ ఎంపీ వ్యవహారంపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.