ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం…సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఉద్యోగులు…నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రెండు పాయింట్లే దాదాపు అన్ని మీడియా చానెళ్ల హెడ్ లైన్స్. ఆ తర్వాత పీఆర్సీ సాధన సమితి నిర్ణయంతో విభేదించిన ఉపాధ్యాయులు…సమ్మెకే ముందుకు వెళ్లాలని నిర్ణయం…సెపరేట్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు…ఇవి తాజా హెడ్ లైన్స్. దీంతో, ఉపాధ్యాయులు ఎందుకు ఇంకా డిమాండ్ల కోసం పట్టుబడుతున్నారు? మిగతా ఉద్యోగులు ఎందుకు మెత్తబడ్డారు? అసలు శనివారం నాడు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకుల భేట ీరోజు రాత్రి ఏం జరిగింది? అన్న భేతాళ ప్రశ్న ఇపుడు చాలామందిలో ఉత్పన్నమవుతోంది.
గతంలో జరిగిన చర్చల మాదిరికాకుండా శనివారం రోజు రాత్రి జరిగిన చర్చల వెనుక కొందరి హస్తం ఉందని తెలుస్తోంది. చలో విజయవాడ కు ముందు ఉద్యోగ సంఘాల నేతలంటే లెక్క లేనట్లుగా సజ్జల అండ్ కో మాట్లాడుతుండగా…సమ్మెపై తగ్గేదేలే అంటూ ఉద్యోగ సంఘాల నేతలు కూడా చర్చలకు వెళ్లబోమంటూ భీష్మించుకు కూర్చున్నారు. అయితే, చలో విజయవాడ తర్వాత సీన్ మారింది. సమ్మెకు వెళితే ప్రభుత్వానికి డ్యామేజీ తప్పదన్న భావనతోనే జగన్ పావులు కదిపారట.
స్టీరింగ్ కమిటీ నేతలను విభజించి…ఒక్కో నేతపై ఎవరిని ప్రయోగిస్తే పనవుతుందో లెక్కలు వేసుకొని క్యాలుక్యులేటెడ్ గా వారిని చర్చలకు వచ్చేలా చేశారట. మంత్రుల కమిటీలోలేని ఓ మంత్రి, కొందరు రాజకీయ, రాజకీయేతర శక్తులు రంగంలోకి దిగి ఉద్యోగ నేతలను విడివిడిగా కలిసి లైన్ లో పెట్టారట. ఆ పెద్దల ఒత్తిళ్లతో ఉద్యోగ సంఘాల నేతలు మెత్తబడినట్లు తెలుస్తోంది.
చర్చలకు వెళ్లేముందే…రాజీకి రావాలని చాలామంది ఉద్యోగ సంఘాల ఫిక్స్ అయ్యేలా ఆ పెద్దలు పావులు కదిపారట. చర్చల్లో ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీతో వివాదానికి దిగి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారట. అయితే, మంత్రుల చొరవతో వారు మళ్లీ చర్చల్లో కొనసాగారట. సీఎం జగన్ తో భేటీ ఏర్పాటు చేస్తాం… ఆయన సమక్షంలోనే కీలక విషయాలపై ప్రకటన చేయిస్తామని పెద్దలు పదేపదే చెప్పి ఉద్యోగ సంఘాల నేతలను ఒప్పించారట.
అదే రీతిలో ఉపాధ్యాయ సంఘాల నేతలను కూడా సీఎం వద్దకు తీసుకెళ్తామని పెద్దలు హామీ ఇచ్చినా..వారు వినలేదట. ఉమ్మడి ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వెళ్లిపోయారు. ఏది ఏమైనా…జగన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేతల నోటితోనే…జగన్ ను అనవసరంగా అపార్థం చేసుకున్నాం అని చెప్పించడంలో మాత్రం ఆ పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది.