తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తోంటే…కరోనా టెస్టుల సంఖ్య తగ్గిస్తున్నారని, మరణాల సంఖ్యను తగ్గించి చూపుతున్నారని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. కరోనా ఫస్ట్ వేవ్ తరహాలోనే సెకండ్ వేవ్ లోనూ తెలంగాణ సర్కార్ తీరు మారలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కరోనా వ్యాప్తిపై విచారణ జరిపిన హైకోర్టు ….ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ గురించి ఆలోచించాలని, నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని సూచించింది. ఈ విషయంపై మే 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
రోజుకు లక్ష టెస్టులు మాత్రమే చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ పెడుతున్నప్పటికీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ రోజు జరిగిన విచారణకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి , సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కంట్రోల్ లోనే ఉందని, కరోనాపై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు.
కరోనా కట్టడికి ఎంత డబ్బయినా సరే ఖర్చు చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని అధికారులను ఆదేశించినట్టు సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రానికి ఆక్సిజన్ తరలించకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలిపారు.