పని నేర్పించటం వేరు. పని నేర్పిస్తున్నానన్న అహంకారం వేరు.
ఈ రెండింటి మధ్య తేడా గుర్తించని వేళ.. నేర్చుకునే వారికి నరకం అంటే ఏమిటో నిత్యం ఎదురవుతుంటుంది.
దీనికి తోడు సున్నిత మనస్కులైన వారికి ఇబ్బందులు రెట్టింపు అవుతుంటాయి. వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో జరిగింది ఇదే. తనకంటే సీనియర్ అయిన సైఫ్.. తాను నేర్పిస్తున్నానన్న పేరుతో అతగాడు వ్యవహరించిన తీరుకు ప్రీతి తీవ్రంగా ఇబ్బంది పడేది. తనను టార్గెట్ చేయొద్దని పేర్కొన్నా.. సైఫ్ వదల్లేదు సరికదా.. విషయాల్ని నేర్పే విషయంలో గట్టిగా చెబితే తప్పేంటన్న వాదన ఒక నిండు ప్రాణం మీదకు తీసుకొచ్చింది.
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య యత్నం చేయటం.. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ఆందోళనకర స్థాయిలో ఉండటం.. ఎక్మా మీద ఉంచి చికిత్స చేస్తున్న వైనం తెలిసిందే. హైదరాబాద్ లోని నిమ్స్ లో ఆమెకు వైద్య చికిత్సలు చేస్తున్నారు.
అయితే.. ప్రీతి ఆత్మహత్యయత్నానికి కారణమైన సైఫ్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంపై కొంత గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి వివరాల్ని వెల్లడించారు.
అనవసరమైన కన్ఫ్యూజన్ ను క్లియర్ చేశారు. ప్రీతిని సైఫ్ వేధించిన మాట నిజమేనని స్పష్టం చేసిన ఆయన.. ప్రీతి ప్రశ్నించటాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు. దీనికి తోడు ప్రీతి సున్నిత మనస్కురాలిగా ఆయన పేర్కొన్నారు.
ఆమె ప్రశ్నించటాన్ని తట్టుకోలేకపోయిన సైఫ్.. తన స్నేహితులకు ప్రీతికి సహకరించొద్దని చెప్పారన్నారు. సైఫ్ తీరుతో మొదట్నించి ఆమె ఇబ్బంది పడుతూనే ఉందన్నారు.
అంతేకాదు.. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేసినట్లుగా వేధించారన్నారు. ఇద్దరి మధ్య రెరండు.. మూడు ఘటనలు కూడా జరిగిన వైనాన్ని సీపీ పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని అవమానించేలా పోస్టులు పెట్టారని.. ఈ సందర్భంగా తనను అవమానించొద్దని సైఫ్ ను ఆమె వేడుకుందని..ఏదైనా ఉంటే హెచ్ వోడీకి చెప్పాలన్న విషయాన్ని వెల్లడించారు.
కేస్ షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా సైఫ్ మాట్లాడారని.. ఈ నెల 18న వాట్సాప్ గ్రూపుల్లో అతడు పెట్టిన మెసేజ్ పై ప్రీతి పర్సనల్ గా ప్రశ్నించిందని.. తనను ఉద్దేశించి గ్రూప్ లో చాట్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు.
‘‘సైఫ్ అధిపత్యం చేసేందుకు ప్రయత్నించాడు. తనను టార్గెట్ చేసినట్లుగా ప్రీతి తన స్నేహితుల వద్ద వాపోయింది. బ్రెయిన్ లేదంటూ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ఆవేదన వయక్తం చేసింది. ఒక వ్యక్తి అవమానకరంగా ఫీల్ అయితే అది ర్యాగింగ్ కిందకే వస్తుంది. ప్రీతిని సైఫ్ అవహేళన చేసిన వైనం చాటింగ్ ద్వారా వెల్లడైంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలతో అతన్ని అరెస్టు చేశాం. అక్కడ సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలన్న కల్చర్ ఉందని.. అయితే దీన్ని బాసిజం తరహాలో ఉందని ప్రీతి భావించింది. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు’’ అని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారం కారణంగా విచారణపై ప్రభావం పడుతుందని పేర్కొన్న సీపీ.. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు.