2019 ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీకి కేంద్రంలోని బీజేపీ విపరీతమైన సహాయసహకారాలందించిందని టాక్ వచ్చింది. కట్ చేస్తే, గత ఏడాది కాలంగా ఈ రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, కోల్డ్ వార్ జరుగుతోందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ పెద్దలపైగానీ, ఆ పార్టీ కేంద్ర నేతలపైగానీ వైసీపీ అధినేత జగన్ మొదలు ఎమ్మెల్యే వరకు పల్లెత్తు మాట అనలేదు.
కానీ, నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో మాత్రం వైసీపీ, బీజేపీల మధ్య గ్యాప్ ఉందన్న టాక్ బలపడుతోంది. నిన్న జగన్ ఇంటిపై సీబీఐ నిఘా పెట్టింది….అదే రోజు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు…అంతేకాదు, వైసీపీ ఇంటికెళ్లే రోజు దగ్గర పడిందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ రోజు బీజేపీ,నడ్డాలపై మాజీ మంత్రి పేర్ని తదితరులు విమర్శలు గుప్పించడం మొదలుబెట్టారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బీజేపీకి జగన్ కటీఫ్ చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పులివెందులలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్‌ను సీబీఐ అధికారులు పరిశీలించి అక్కడ కొలతలు తీసుకున్నారు. జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నివాస ప్రాంతాలను కూడా సర్వేయర్లతో కొలతలు తీయించారు. ఈ కేసులో తొలిసారిగా జగన్ ఇంటి కొలతలు తీసుకోవడం ద్వారా తొలిసారిగా డైరెక్ట్ గా జగన్ ను సీబీఐ టచ్ చేసినట్లయింది.
ఇక, ఇదే రోజు ఏపీలో పర్యటించిన నడ్డా…వైసీపీపై విమర్శలు గుప్పించారు. అయితే, నడ్డా కామెంట్లకు దీటుగా వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఏం మేలు చేసిందని నడ్డానుద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. ‘పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో బరితెగించి అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడానికే ఢిల్లీ నుంచి వచ్చారా?’ అని ప్రశ్నించారు. ‘మీలాంటి వారిని చూసే రాజకీయ నాయకులకు సిగ్గు లేదని ప్రజలు అనుకుంటున్నారు’ అంటూ నడ్డాపై నాని ఘాటు కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.