పాకిస్థాన్-భారత్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహనను స్వాగతిస్తూనే సోషల్ మీడియా సహా.. పలు ప్రతిపక్షాల నాయకులు దీనివెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కానీ, అటు కేంద్రం కానీ.. స్పందించలేదు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టాలని.. చర్చించాలని పట్టుబడుతున్నారు. లేకపోతే.. అఖిల పక్షం వేసి.. ప్రధాని మోడీ రావాలనికూడా డిమాండ్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆర్మీ మాజీ చీఫ్(ఈయన హయాంలోనే సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయి) జనరల్ మనోజ్ నరవాణే స్పందించారు. “యుద్ధం అంటే సినిమా అనుకుంటున్నారా?“ అని విమర్శలు చేస్తున్నవారిని నిలదీశారు. భారత సంకల్పాన్ని అర్ధం చేసుకునే మనసు కూడా లేదా? అని ప్రశ్నించారు. యుద్ధమే వస్తే.. చేసేందుకు మన వీరులు ఎప్పటికీ సరిహద్దుల్లో సిద్ధంగానే ఉంటారని చెప్పిన ఆయన.. కానీ.. భారత్ గత దశాబ్ద కాలంగా శాంతిని ప్రపంచానికి బోధిస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
“మనం ప్రపంచానికి శాంతి చెబుతూ.. మనమే యుద్ధానికి పురిగొల్పితే సరైన విధానం అనిపించుకుం టుందా? అనేది విమర్శకులు గుర్తించాలి. మన సైన్యం బీరువు(ధైర్యం) పోలేదు“ అని అన్నారు. అయితే.. యుద్ధం కారణంగా.. అనేకమంది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇరు దేశాలకు ఇది నష్టమే. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా దేశాలు యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. అందుకే.. ప్రాథమిక మార్గమైన.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
“మనం నగరాల్లో ఉంటున్నాం. కానీ.. ఒక్కసారి సరిహద్దుల కు వెళ్లి చూడండి. అక్కడ బతికే జనాలు.. యుద్ధం వస్తే..గుండెలను అరచేతిలో పెట్టుకుని రోజుల తరబడి ఆవాసాలను వదిలి.. నడిరోడ్డుపై జీవిస్తారు. వారి జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో అనేక సందర్భాల్లో నేను స్వయంగా చూశాను. ఇక్కడ యుద్ధం కోరుకునేవారు అక్కడి వారు ఏమనుకుంటున్నారోతెలిస్తే.. ఎలా జీవిస్తున్నారో తెలిస్తే.. నోట మాట రాకపోవచ్చు.“ అని నరవాణే వ్యాఖ్యానించారు.
‘‘యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. ఇదేం బాలీవుడ్ సినిమా కాదు. చాలా తీవ్రమైన అంశం“ అని పరోక్షంగా విమర్శకులను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. తెలివి తక్కువ వారు(పాకిస్థాన్ పాలకులు) యుద్ధానికి దిగినా.. వసుధైక కుటుంబం అని పలవరించే భారత్.. దీనిని ఆయుధంగా చేసుకుని రెచ్చిపోతే.. మనకు వాళ్లకు తేడా ఏముంటుందన్నారు. అయితే.. యుద్ధమే చేయాల్సిన పరిస్థితి కల్పిస్తే.. ఈ దేశంలో అందరికన్నా ముందు యుద్ధం కోరుకునేది మన సైనికులేనని వ్యాఖ్యానించారు.