ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్టు జగన్ చెప్పగానే అమరావతే రాజధానిగా కొనసాగాలన్న వారంతా ఎగిరి గంతేశారు. అయితే, మళ్లీ బిల్లు తెస్తానని, ఈసారి లోపాలన్నీ సరిచేసుకొని మరోసారి బిల్లుపెడతానని చెప్పడంతా ఆ ఆనందం అంతా ఆవిరైంది. దాంతోపాటు, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొనాలని ఏపీ బీజేపీ నేతలను అమిత్ షా ఆదేశించారు.
దీంతో, అమరావతిపై జగన్ మనసు మార్చుకుంటారేమో అనుకున్నవారికి నిరాశే ఎదురైంది. తాజాగా ఆ నిరాశను మరింత పెంచుతూ…కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిపై తన పగ ఇంకా చల్లారలేదని, అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని కాదని జగన్ తాజా ప్రయత్నంతో అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ గజిట్ జారీ చేసింది. వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను విచారణ జరిపే వక్ఫ్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో ఉన్న ఈ ట్రిబ్యునల్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంది. కానీ, తాజాగా దానిని కర్నూలుకు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
గతంలోనే అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఉంది. కానీ, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను అమరావతి నుంచి తరలించడం లేదని, హైదరాబాద్ లో ఉన్న దానిని కొత్తగా కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నామని జగన్ కొత్త వాదన వినిపించే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన జగన్ అదే తరహాలో వక్ఫ్ ట్రైబ్యునల్ ను కూడా ఏర్పాటు చేశారు.
గతంలో ఆ కమిషన్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉండగా…దానిని కర్నూలులో ఏర్పాటు చేశారు. దాంతోపాటు, లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కూడా కర్నూలులో ఏర్పాటు చేశారు. మరి, ఈ వ్యవహారంపై జగన్ కు న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఎదురవుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.