అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ ఇంకా కుదిపేస్తోంది. దేశం మొత్తం మీద సుమారు 2500 మంది చనిపోతున్నారు. కరోనా వైరస్ తో మరణాల సంఖ్య ఒకవైపు ప్రభుత్వాన్ని వణికించేస్తోంది. ఇదే సమయంలో మరణించిన వారికి సరైన అంత్యక్రియలు కూడా జరపే అవకాశాలు లేకపోవటం జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవటంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో అంత్యక్రియలు నిర్వహించటం కష్టంగా మారిపోయింది.
అంత్యక్రియలు నిర్వహించలేక లాస్ ఏంజిలిస్ రాష్ట్రంలోని అంత్యక్రియల కేంద్రాలకు వస్తున్న మృతదేహాలను తిప్పిపంపేస్తున్నారు. కాంటినెంటల్ ఫ్యూనరల్ హోం యజమాని మాగ్దా మాల్చనాడో మాట్లాడుతూ తన 40 ఏళ్ళ సర్వీసులో మృతదేహాలను ఖననం చేయకుండా వెనక్కు తిప్పిపంపే రోజులు వస్తాయని అనుకోలేదని చాలా బాధతో చెప్పారు. ఈ పరిస్ధితి ఎందుకు వచ్చిందంటే కేవలం కరోనా వైరస్ ప్రభావంతో పెరిగిపోయిన మరణాలే అన్నారు. మామూలుగా తన సెంటర్ కు 5 మరణాలు వస్తే ఇఫుడు రోజుకు డెడ్ బాడీస్ వస్తున్నట్లు చెప్పారు.
ఇన్ని మృతదేహాలు ఒకేసారి ఖననం కోసం వస్తుండటంతో తాము ఒత్తిడిని భరించలేకపోతున్నట్లు చెప్పారు. ఎందుకంటే ఖననం కోసం వస్తున్న డెడ్ బాడీస్ అన్నీ కరోనా వైరస్ కారణంగానే కావటంతో అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటానికి చాలా సమయం పడుతోందన్నారు. ఈ కారణంగానే రోజుకు ఏడెనిమిది మృతదేహాలకు మించి అంత్యక్రియలు జరపలేకపోతున్నామన్నారు. మాల్చనాడో మాటలు అమెరికా పరిస్ధితికి అద్దం పడుతోంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లోని ఫ్యూనరల్ సెంటర్లలో ఇదే పరిస్ధితి కనబడుతోంది.
ఒకపుడు అంటే సుమారు ఆరుమాసాల క్రితం కూడా అమెరికాలో ఇదే పరిస్ధితి తలెత్తటంతో సామూహిక అంత్యక్రియలను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. న్యూయార్క్ కు సమీపంలోని హోప్ ఐల్యాండ్స్ కు మృతదేహాలను తీసుకెళ్ళి అక్కడ సామూహిక ఖననాలు చేశారు. అయితే అక్కడి జనాలు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో దాన్ని ఆపేశారు. ఆ తర్వాత చాలా ఆసుపత్రుల్లో మృతదేహాలను ప్యాక్ చేసి రోజుల తరబడి ఉంచేసిన విషయం కూడా తెలిసిందే. మొత్తంమీద కరోనా వైరస్ దెబ్బకు అమెరికా బాగా వణికిపోతోందనేందుకు తాజా ఉదంతాలే నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.