టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై దాఖలైన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో సీబీఐ విచారణ జరపాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఉండవల్లి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న పలు అక్రమాలపై కూడా సీబీఐ విచారణ కోరాలని ఉండవల్లికి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉండవల్లిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉండవల్లి ఊసరవెల్లి అని అయ్యన్న చురకలంటించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జగన్ జైల్లో పెట్టించారని, దానికి ఉండవల్లి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో బ్రాందీ బాటిళ్లు చూపించిన ఉండవల్లి జగన్ పాలనలో కళ్ళు మూసుకున్నారని మండిపడ్డారు. తిరుపతి కొండపై, ఋషికొండపై జరుగుతున్న అక్రమాలపై ఉండవల్లి ఎందుకు మాట్లాడడం లేదని అయిన ప్రశ్నించారు. గోదావరిలో ఇసుక మాయమవుతున్నా ఉండవల్లి ప్రశ్నించడం లేదని, అందులో ఉండవల్లికి వాటా ఉందా అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మార్గదర్శిపై ఉండవల్లి మాట్లాడుతారని అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ డైరెక్షన్ లో ఉండవల్లి పని చేస్తున్నారని ఆరోపించారు. ఇంకెన్నాళ్లు బతుకుతావు ఉండవల్లి బతికినన్ని రోజులు మంచి పనులు చేయి అంటూ హితవు పలికారు. ఉండవల్లి మేధావి కాదని మేతావి అని విమర్శించారు. ఉన్నత కులంలో పుట్టిన ఉండవల్లి టీటీడీ అక్రమాల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. స్కిల్ కేసులో ఏముందని సీబీఐ విచారణ కోరుతున్నారని, జగన్ పాలన గురించి ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.