మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దివంగత నేత వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడిగా…కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఉండవల్లికి పేరుంది. న్యూట్రల్ అని చెబుతూనే జగన్ కు అనుకూలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తుంటారన్న విమర్శలున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూరేలా త్వరలోనే ఉండవల్లి వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
జగన్ ఆహ్వానాన్ని మన్నించి ఈ నెల 26న ఉండవల్లి వైసీపీలో చేరబోతున్నట్లు వైసీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేత శైలజా నాథ్ కూడా ఫ్యాన్ కింద సేద తీరేందుకు వైసీపీలో చేరారు. ఆ బాటలోనే ఉండవల్లి కూడా ప్రయాణించబోతున్నారని తెలుస్తోంది. ఉండవల్లి బాటలోనే మరి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వస్తోంది.
అయితే, వైసీపీలో చేరికపై ఉండవల్లి నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అలా అని, ఈ ప్రచారాన్ని ఉండవల్లి ఖండించనూ లేదు. దీంతో, వైసీపీలో ఉండవల్లి చేరిక దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం, గత ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో సజ్జల ప్రాభవం కాస్త తగ్గడం వంటి కారణాలతో జగన్ కు సీనియర్ రాజకీయ సలహాదారుడి పాత్రను ఉండవల్లి పోషించే చాన్స్ ఉంది. అయితే, ఇప్పటిదాకా ఉండవల్లి వైసీపీ తరఫున పార్ట్ టైం పొలిటిషియన్ గా స్లీపింగ్ మోడ్ లో ఉన్న ఉండవల్లి…త్వరలోనే ఫుల్ టైం వైసీపీ నేతగా మారబోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.