టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ కెరీర్ కు కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. 2011లో వెస్టిండీస్ తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.
కొంతకాలంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ లో ఇంగ్లండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ముందు కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో బీసీసీఐతో పాటు కోహ్లీ అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇంగ్లండ్ తో జూన్ నెలలో జరగబోతున్న టెస్ట్ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని కోహ్లీకి బీసీసీఐ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఓ సీనియర్ క్రికెటర్ తో బీసీసీఐ పెద్దలు రాయబారం నడుపుతున్నారని తెలుస్తోంది.
అయితే, బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదని కోహ్లీ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే కోహ్లీ కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు వన్డే క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి.