ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. కొన్ని నెలల పాటు సైలెంట్‌గానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. సరైన టైమ్ చూసి ఒక్కో నాయకుడిని లాక్ చేస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలను వరుసగా బటయకు లాగుతోంది. దాంతో రాష్ట్రంలో అరెస్ట్‌ల పర్వం ఊపందుకుంది. ఫలితంగా విజయవాడ సబ్ జైలుకు వీఐపీలు క్యూ కడుతున్నారు.
నాలుగు నెలలు ముందు వరకు రాష్ట్రంలో రాజమండ్రి సెంట్రల్ జైలే ఫేమస్. కానీ ఇప్పుడు విజయవాడ సబ్ జైల్ ఫేమస్ గా మారింది. పలు కేసుల్లో కీలక నేతలంతా ఆ జైలులోనే ఉండటంతో.. నిత్యం అక్కడ ఎటు చూసినా వీఐపీలే దర్శనమిస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ లీడర్ వల్లభనేని వంశీ దాదాపు మూడు నెలల నుంచి విజయవాడ సబ్ జైలులోనే ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీపై ఆ తర్వాత మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటుంటే.. మరొక కేసులో పీటీ వారెంట్ దాఖలు అవుతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
మరోవైపు ముంబై నటి కేసులో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు విజయవాడ సబ్ జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, బాలాజీ గోవిందప్ప ఉన్నారు. వీరంతా ఇప్పుడు విజయవాడ కారాగారంలోనే జైలు జీవితం గడుపుతున్నారు. వీరితో ములాఖత్ అయ్యేందుకు నిత్యం వీఐపీలు విజయవాడ సబ్ జైలుకు క్యూ కడుతున్నారట.