వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం చేసేందుకు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పార్టీ జన సేన నాయకులకు పిలుపునిచ్చారు. ఇదేసమయంలో పార్టీ కేడర్ జనసైనికులకు కూడా ఆయన సూచించారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క నాదెండ్ల మనోహర్ మినహా .. మిగిలిన నాయకులు విజయవాడకు రాలేదు. జనసైనికులు కూడా ఎక్కడున్నారో.. కనిపించడం లేదు. మరోవైపు.. సీబీఎన్ ఆర్మీ పేరిట టీడీపీ కార్యకర్తలు.. బ్లౌజులు ధరించి సేవలు చేస్తున్నారు.
బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరే కనిపిస్తున్నారు. ఇతర స్వచ్ఛంద సంస్థల తరఫున కూడా సేవలు అందుతున్నాయి. అయినా.. విజయవాడ శివారు ప్రాంతాలైన పాయకాపురం, ప్రకాష్‌నగర్, శాంతి నగర్ ప్రాంత వాసులకు మాత్రం ఇంకా సేవలు అందడం లేదు. అయితే..ఆయా ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు ఎక్కువ మందే ఉన్నా.. జనసేన తరఫున ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంతేకాదు, కనీసం కనిపించడం లేదు.
దీనికి కారణం ఏంటనేది ఆసక్తిగా మారింది. క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలతో కలిసి పనిచేసేందుకు కొందరు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదేసమయంలో తమకు ఎలాంటి పనీ అప్పగించడం లేదని.. విజయవాడ శివారు ప్రాంత నాయకుడు శోడిసెట్టి రాధా వర్గం చెబుతోంది. “మాకు ఎలాంటి పనీ ఇవ్వడం లేదు. మేం వచ్చాం. తిరిగి వెళ్తున్నాం“ అని రాధా చెప్పడం రాజకీయంగా చర్చకు దారితీసిం ది. అంటే.. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ, అటు చంద్రబాబు కానీ.. ఇటు పవన్ కల్యాణ్ కానీ.. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచే యాలని చెబుతున్నారు. వరద బాధితులకుసేవలు అందించాలని పిలుపునిస్తున్నారు. కానీ, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది. దీంతో క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు, కార్యకర్తలు.. దూరంగా ఉండడం గమనార్హం. మరి ఈ లోపాన్ని సరిదిద్దితే.. నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా చూస్తే.. బాధిత ప్రజలకు మరిన్నిసేవలు అందించే అవకాశం ఉంటుంది.