వెంట ఉండాల్సిన వారు వెనక్కి వెళ్లిపోవటం.. నమ్మినోళ్లు నట్టేట ముంచేస్తూ తమ దారి తాము చూసుకోవటం లాంటివి భరించటం కాస్త కష్టమే. ఇక, మాజీ సీఎం జగన్ వంటి ఒంటెత్తు పోకడ ఉన్న నేతలు అలా నేతలు వెళ్లిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేరు. విదేశాల్లో తాను ఉన్నానని, వచ్చాక మాట్లాడకుందామని విజయసాయికి జగన్ చెప్పినా ఆయన వినకుండా రాజీనామా చేసి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
దీంతో, హర్టయిన జగన్….పోయేవారు పోతే పోండి…దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతోనే పార్టీ ఉంది…అని చెప్పడం కాస్త షాకింగ్ గా మారింది. మంచైనా.. చెడైనా.. కష్టమైనా.. నష్టమైనా.. సుఖమైనా.. అన్నింటిని ఒకేలా చూడాలి అన్న తత్వం జగన్ చెప్పడం బాగానే ఉంది కానీ, తన హయాంలో చాలామంది నేతలను జగన్ చూసిన తీరును ఆయన ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘మనంతట మనమే ప్రలోభాలకు లొంగో.. భయపడో.. రాజీ పడో.. అటువైపు పోతే మన వ్యక్తిత్వం.. విలువ.. విశ్వసనీయత ఏంటి? సాయిరెడ్డికైనా.. పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే. వైసీపీ ఈ రోజు ఉందీ అంటే వారి వల్ల కాదు.. దేవుడి దయ. ప్రజల ఆశీస్సులతోనే ఉంది’ అన్న జగన్ మాటలు వైసీపీ శ్రేణులకు ఊరటనిచ్చాయి.
అయితే, ప్రజలు చాలు…నేతలు వస్తుంటారు పోతుంటారు అని చెప్పడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా…పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట ఉన్న సాయిరెడ్డి తన మాట జవదాటి పార్టీని వీడడం మాత్రం జగన్ కు మింగుడు పడడం లేదు.