వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఏ2 అని విపక్షాలు విమర్శించే వియసాయిరెడ్డిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఆగస్టు 22న ఢిల్లీకి వెళ్లి మోడీని కలిశారని, కానీ, ఎందుకు కలిశారో జగన్ కే క్లారిటీ లేదని చురకలంటించారు. లిక్కర్ అంశానికి సంబంధించి జగన్ కు క్లాస్ పీకేందుకే మోడీ పిలిపించారని ఢిల్లీలో అంటున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో అవకతవకలు జరగలేదని సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం కాక ముందు అక్కడి ప్రజలు ముంబై, సూరత్ లకు వలస వెళ్లేవారని, ఇక, జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రా ప్రజలు తెలంగాణకు వలస వెళ్తున్నారని చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని విమర్శించారు.
వాటి అమలు జరిగితే ఏపీలో ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఎందుకు 40 శాతం మాత్రమే భర్తీ అయ్యాయని నిలదీశారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేశంలోని అన్ని కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయని సాక్షిలో కథనాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. అలా అయితే, తెలంగాణలో స్టూడెంట్లకు అడ్మిషన్లు ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, అది కేవలం సాక్షి పత్రికలో మాత్రమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
జగన్ పాలనలో ఏపీ ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని మండిపడ్డారు. ఏపీలో ఉద్యోగులపై జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని, రైళ్లలో, బస్సుల్లో పోలీసులుతో తనిఖీలు చేపట్టడం సరికాదని అన్నారు. సొంత డబ్బులతో పేద ప్రజలకు అన్నం పెడుతోన్న అన్న క్యాంటీన్లను నాశనం చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రతీ విషయంలోనూ జగన్ సూట్ కేసులతో దాడులు చేస్తున్నారని, వాటిని తట్టుకొని తనకు న్యాయం దక్కుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు.