సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై గత కొద్ది నెలలుగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణల మీద విచారణలు..వాయిదాల మీద వాయిదాలు పడిన తర్వాత ఈ నెల 25న జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై మరో మారు విచారణ జరగనుంది. అయితే, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ అధికారుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ కు సంబంధించి ముందుగా లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని చెప్పిన సీబీఐ అధికారులు…ఆ తర్వాత లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని కోర్టును 10రోజుల గడువు కోరడం విమర్శలకు తావిచ్చింది. ఇక, చివరకు జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై నిర్ణయాన్ని కోర్టుకే వదిలేస్తున్నామని సీబీఐ ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ కీలక నేత, రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలోనూ సీబీఐ అధికారులు దాదాపుగా జగన్ కేసులో ప్రొసీడింగ్స్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై కోర్టు విచక్షణ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలంటూ తాజాగా నేడు జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు …కోర్టుకు విన్నవించడం చర్చనీయాంశమైంది. గతంలో జగన్ విషయంలో మెమో దాఖలు చేసిన విధంగానే ఇప్పుడు కూడా బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామంటూ మెమో దాఖలు చేసింది. దీంతో, జగన్ తరహాలోనే బంతిని కోర్టు పరిధిలోకి సీబీఐ నెట్టినట్లయింది.
అయితే, విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత గడువు కావాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విజయసాయి తరఫు లాయర్ కౌంటర్ దాఖలు చేస్తారా …లేక మరింత గడువు కోరతారా అన్నది వేచి చూడాలి.