‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న క్రేజ్, ఫాలోయింగ్ చూసి టాలీవుడ్లో టాప్ స్టార్లకు సైతం అసూయ పుట్టి ఉంటే ఆశ్చర్యం లేదు. తాను పరిశ్రమలోకి వచ్చిన ఎన్నో ఏళ్లకు ‘ఖైదీ’తో స్టార్ ఇమేజ్ సంపాదిస్తే.. విజయ్ చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్ అయిపోయాడంటూ మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
విజయ్ క్రేజ్ చూసి ఓర్వలేక కొందరు పనిగట్టుకుని ‘డియర్ కామ్రేడ్’కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి గత ఏడాది. అంతగా పేరులేని దర్శకులతోనే విజయ్ ఇలాంటి హిట్లు ఇస్తే.. ఒక స్టార్ డైరెక్టర్ చేతిలో పడితే, మంచి సినిమాతో వస్తే ఇంకెలా ఉంటుందో అన్న చర్చ అప్పట్లో నడిచింది.
ఒక దశలో కొరటాల శివతో విజయ్ సినిమా అంటూ గుసగుసలు వినిపించాయి కానీ.. వాళ్ల కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు.ఈలోపు ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు విజయ్ క్రేజ్, ఫాలోయింగ్‌ను దెబ్బ తీశాయి. ప్రస్తుతం అతను పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుడితోనే సినిమా చేస్తున్నప్పటికీ.. పూరి ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సినిమాపై మరీ అంచనాలేమీ లేవు. ఈ సినిమా బాగా ఆడితే ఆశ్చర్యపోయేలా ఉన్నారు జనాలు.
ఫాంలో ఉన్న స్టార్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా చేయాలని అతడి అభిమానులు కోరుకున్నారు. ఐతే వారు కోరుకున్నదానికంటే పెద్ద దర్శకుడు ఇప్పుడు విజయ్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఆయనే సుకుమార్. ‘రంగస్థలం’ లాంటి నాన్-బాహుబలి హిట్ ఇచ్చి, ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ లాంటి భారీ ప్రాజెక్టు చేస్తున్న సుక్కు.. దాని తర్వాత విజయ్‌తో సినిమా చేయడానికి ముందుకు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఈ కలయిక ఎవరూ ఊహించనిది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. పూరి సినిమా బాగా ఆడి, సుక్కు సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు ఆడితే విజయ్ టాప్ స్టార్లతో పోటీపడటం ఖాయం. అప్పుడుంటుంది అసలు మజా.