రాములమ్మకు మరోసారి కోపమొచ్చింది. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఉన్న ఆమె ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల్ని పెట్టి.. సీఎం కేసీఆర్ మీద కదం తొక్కిన ఆమె.. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్ని అన్ని సమస్యల్ని టోకుగా ప్రస్తావనకు తీసుకొచ్చి.. కేసీఆర్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్య చేశారు. అస్తవ్యస్త పాలనా తీరుకు దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం చులకన అయ్యిందని ఆమె ఆరోపించారు. ఉద్యమకాలంలోనూ.. ఎన్నికల సమయంలోనూ ఇచ్చిన హామీలన్ని పిట్టల దొర కబుర్లే తప్పించి.. మరింకేమీ కాదని తేల్చింది. కేసీఆర్ హామీతో సన్న బియ్యాన్ని పండించిన పాపానికి మద్దతు ధర దొరక్క రాష్ట్ర రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సి వస్తోందని పేర్కొన్నారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారన్నారు. అన్నదాతలు తమ పంటలకు నిప్పు పెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే కాదు.. విద్యార్థులు.. నిరుద్యోగులు కేసీఆర్ పాలనలో అవస్థలు పడుతున్నారన్నారు. ఉద్యోగాల హామీని నమ్ముకొని పలువురు.. అవి తీరక నిరాశతో బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు.
వివిధ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలోనూ కేసీఆర్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్నారు. ఇటీవల తీసుకొచ్చిన ధరణి వెబ్ సైట్ పని తీరును తప్ప పట్టారు. మొత్తానికి కేసీఆర్ సర్కారు వైఫల్య చిట్టాను చదివేసిన రాములమ్మ.. సీఎం సారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారని చెప్పాలి.