టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేలు జంటగా నటించిన లైగర్ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉంది.
ఇక విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్ల మీద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనన్య పాండేను రౌడీ హీరో తన ఇంటికి తీసుకెళ్లాడు. వారిద్దరూ కలిసి జంటగా పూజ కూడా చేశారు. విజయ్ దేవరకొండ ,అనన్యల కోసం విజయ్ తల్లి ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో వారిద్దరూ పాల్గొన్నారు. దేశమంతా చుట్టేస్తోన్న విజయ్ దేవరకొండ, అనన్యలు ఇకపై కూడా క్షేమంగా ప్రయాణించాలని కోరుతూ ఆమె పూజ నిర్వహించారు.
ఆ పూజ ఫోటోలను షేర్ చేస్తూ విజయ్ కొండ ట్వీట్ చేశాడు. తాము గత నెలలో చాలా రోజులు దేశమంతా చుట్టేశామని, తమకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి చాలా మద్దతు లభించిందని రౌడీ హీరో ట్వీట్ చేశాడు. ఆ ప్రేమంతా తనకు దేవుడి దీవెనలలా కన్పించిందని, కానీ తమకు దేవుడి తోడు ఉండాలని మమ్మీ అనుకుంటోందని, అందుకే ఈ పూజ ఏర్పాట్లు చేసిందని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు, ఈ పూజ తర్వాత మమ్మీ ప్రశాంతంగా నిద్రపోతుందని, తాము తమ టూర్ ను కొనసాగిస్తామని చెప్పాడు. ఇప్పటిదాకా ప్రమోషన్ ఈవెంట్ల కోసం పాష్ గా కనిపించిన విజయ్, అనన్యాలు పూజలో కూర్చొని సంప్రదాయబద్ధంగా కనిపించడం విశేషం. దీంతో, ఈ జంట పూజ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి