నచ్చనోళ్ల మీద సంధించే ఆయుధంగా మారింది ‘బాయ్ కాట్’. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని బాయ్ కాట్ పేరుతో చేసే యుద్దం ఇప్పుడో పెద్ద గుబులుగా మారింది. ఎవరికో.. ఎందుకో నచ్చనంతనే మొదలయ్యే ఈ బాయ్ కాట్ ఉద్యమం కొన్నిసార్లు గతి తప్పుతూ ఉంటోంది. అలా అని దీన్ని తేలిగ్గా తీసేయటానికి లేదు. పెద్ద ఎత్తున జరిగిన ఆన్ లైన్ బాయ్ కాట్ ఉద్యమం దెబ్బకు అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ ఫలితం ఏమైందో చూసిన తర్వాత నుంచి సినిమా జీవులు కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయినప్పటికీ.. ఏదో ఒక కారణాన్ని చూపించి బాయ్ కాట్ చేయాలన్న పిలుపు వస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మూవీ ‘లైగర్’. దాదాపు మూడేళ్ల కష్టానికి ఫలితంగా వస్తున్న ఈ మూవీకి ఈ శుక్రవారం విడుదల కానుంది. అనూహ్యంగా ఈ మూవీని బాయ్ కాట్ చేయాలన్న పిలుపునిచ్చారు. కింది స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన విజయ్ దేవరకొండను టార్గెట్ చేయటానికి ఏముందన్న ప్రశ్నకు బాయ్ కాట్ బ్యాచ్ భారీ చిట్టా విప్పుతున్నారు.
తాము బాయ్ కాట్ చేసిన అమీర్ ఖాన్ ను సమర్థించే ప్రయత్నం చేయటం.. విలేకరుల సమావేశంలో కాళ్లను టేబుల్ మీద పెట్టి మాట్లాడిన తీరు.. ఈ మూవీ హీరోయిన్ అనన్య పాండే విజయ్ ఇంటికి వెళ్లినప్పుడు ప్రత్యేక పూజలు నిర్వహించటం.. అర్చకులు నిలబడి ఆశీర్వచనం చేస్తుంటే విజయ్ నిలబడకుండా కూర్చోవటం.. బాయ్ కాట్ వర్గానికి అస్సలు నచ్చని కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించటంలాంటి పెద్ద లిస్టునే చెబుతున్నారు.
ఇవన్నీ సిల్లీ రీజన్స్ గా కొట్టి పడేసే వారికి.. మరో ఆయుధాన్ని బయటకు తీశారు. అదేమంటే.. గతంలో విజయ్ దేవరకొండ తల్లి మాట్లాడి మాటల్ని చిన్న బిట్ గా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ‘తమది దొరల ఫ్యామిలీ అని.. తాము గడీలలో బతికే వాళ్లమని ఆమె చెప్పటం కనిపిస్తుంది. అంతేకాదు అదే వీడియోలో విజయ్ తల్లి మాట్లాడుతూ.. ‘మా అమ్మను దొరసాని మాదిరి చూసేవారు. ఇప్పటికి మేం ఊరికి వెళితే మా పాలేర్లు మమ్మల్ని దొరల మాదిరి చూస్తారు’ అన్న వ్యాఖ్యలు ఉన్నాయి.
వీటిని కారణాలుగా చూపుతూ లైగర్ మూవీని బాయ్ కాట్ చేయాలని ప్రచారం చేస్తున్నారు. మరి.. బాయ్ కాట్ బ్యాచ్ వైరల్ చేస్తున్న ఈ చిట్టి వీడియో ఆయుధంగా మారుతుందా? లేదంటే.. ఇలాంటి వాటిని జనాలు లైట్ తీసుకుంటారా? అన్నది ఈ వారం తేలిపోనుంది. ఏమైనా.. బాయ్ కాట్ బ్యాచ్ ఒకసారి టార్గెట్ చేస్తే.. వదిలిపెట్టరన్న విషయాన్ని అర్థమయ్యేలా లైగర్ విషయంలో వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.