మనసులోని ప్రేమను.. అభిమానాన్ని వ్యక్తీకరించటానికి ఇవాల్టి రోజున ఉన్న మాథ్యమాల్ని తమదైన శైలిలో వినియోగించుకుంటున్నారు పలువురు. తక్కువ వ్యవధిలోనే బోలెడంత మంది అభిమానుల్ని.. క్రేజ్ ను సంపాదించుకొని చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే హీరోలు చాలా తక్కువగా కనిపిస్తారు. అందునా.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఇలాంటి హద్దుల్ని ఇట్టే చెరిపేసి తారాపథంలోకి దూసుకెళ్లిన విజయ దేవరకొండను అభిమానులు అప్యాయంగా తమ ‘రౌడీ’గా ఆరాధిస్తుంటారు.
తమ మనసులో ఉండే అభిమానాన్ని.. ఆరాధనా భావాన్ని బయటకు చెప్పేందుకు స్టార్ డమ్ ఉన్న హీరోలు పెద్దగా ఇష్టపడరు. అలాంటివేమీ లేకుండా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసే స్పెషల్ టాలెంట్ విజయ్ లో పుష్కలంగా ఉంటుంది. తాజాగా చేసిన ట్వీట్ లో తనదైన యాటిట్యూడ్ ను చూపించేందుకు అస్సలు మొహమాటపడలేదు. సమంత కీలక భూమిక పోషించిన థ్రిల్లర్ మూవీ ‘యశోద’ ట్రైలర్ తాజాగా విడుదల కావటం తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియా ఫిలింగా రూపొందించారు. కథ మొత్తం సరోగసీ (అద్దె గర్భం) అంశం చుట్టూనే తిరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
సమంతకు ఉన్న ఇమేజ్ ను బహుబాషా మూవీగా మార్చి కొత్త ప్రయోగానికి దిగుతున్నారు యశోద మూవీ నిర్మాతలు. వచ్చే నెల (నవంబరు) 11న విడుదలయ్యే ఈ మూవీకి ట్రైలర్ ను వివిధ భాషల్లో.. ఆయా ప్రముఖ హీరోలతో రిలీజ్ చేశారు. తమిళంలో సూర్య.. కన్నడలో రక్షిత్ శెట్టి.. మలయాళంలో దుల్కర్ సల్మాన్.. హిందీలో వరుణ్ ధావన్.. తెలుగులో విజయ్ దేవరకొండలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సమంత మీద తనకున్న అభిమానాన్ని ట్వీట్ రూపంలో చెప్పేశారు.
తన కాలేజీ రోజుల్లో సమంత సినిమాను తొలిసారి చూసినప్పుడే ఆమెతో తాను ప్రేమలో పడిపోయినట్లు చెప్పాడు. ‘తొలిసారి వెండితెర మీద చూసి అభిమానిగా మారా. అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డా. ఇప్పటికి ఆమెను ఆరాధిస్తున్నా’ అంటూ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. యశోద చిత్ర యూనిట్ కు ఆయన అల్ ద బెస్ట్ చెప్పుకొచ్చారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనే సమంత మీద తనకున్న ఆరాధన భావాన్ని చాటుకునే విజయ్ దేవరకొండ తన మాటలతో ఆకర్షిస్తుంటారు. తాజాగా అదే పని చేశాడని చెప్పాలి.