సాధారణంగా ఎక్కడైనా సరే.. తమకు అన్యాయం జరిగిందని చెబుతూ పోలీసుల్ని ఆశ్రయించినప్పుడు.. విచారించి బాధితులుగా తేలితే వారికి అండగా ఉండటం ఎక్కడైనా చూస్తుంటాం. అందరి మాదిరి వ్యవహరిస్తే వారు చందానగర్ (హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతం) పోలీసులు ఎందుకు అవుతారు చెప్పండి. అయ్యా.. మాకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ. .న్యాయం చేయాలని ఆశ్రయించిన వారిని చితకబాదటం ద్వారా సరికొత్త తరహా పోలీసింగ్ ను షురూ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో ఒక దళిత బాలికను ఒక పోకిరి వేధింపులకు గురి చేస్తున్నాడు.
ఇటీవల కాలంలో ఆ పోకిరి చేష్టలు మరింత ఎక్కువ అయ్యాయి. హద్దులు దాటేసి.. సదరు బాలిక మీద లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి చందానగర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి లైంగిక వేధింపుల కేసు వచ్చినంతనే.. మిగిలిన ఫిర్యాదుల్ని పక్కనపెట్టేసి.. బాధితురాలికి.. వారి కుటుంబానికి అండగా నిలవటం.. నిందితుల తాట తీయటం లాంటివి చేస్తారు. అందుకు భిన్నంగా చందానగర్ పోలీసులు మాత్రం భిన్నంగా వ్యవహరించారు.
నిందితుడికి వత్తాసు పలికారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ మాటలకు ప్రభావితమైన వారు.. అసలు నిందితుడ్ని వదిలేసి.. కంప్లైంట్ ఇచ్చిన బాలిక తండ్రిని వేధింపులకు గురి చేశారు. కేసు పెట్టేదేమిటి? మర్యాదగా దాన్ని వెనక్కి తీసుకోవాలన్న బెదిరింపులకు దిగిన నిందితుడి తరఫు వారికి వత్తాసు పలికినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ఒకరు ఎంట్రీ ఇవ్వటం.. హల్ చల్ చేయటం లాంటివి చేశారు.
దీంతో నిందితుడ్ని పట్టించుకోని పోలీసులు.. బాధితురాలి తరఫు వారిని వేధించటం మొదలు పెట్టారు. కేసు పెట్టా వలని డిమాండ్ చేసిన బాధితురాలి తండ్రిపై చందానగర్ ఎస్ఐ చేయి చేసుకోవటం.. బెదిరింపులకు దిగారు. జూన్ 2న కంప్లైంట్ చేస్తే జూన్ 15 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరికదా.. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగిన పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. కేసు వెనక్కి తీసుకొని బాధితురాలి తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి.. అతన్ని విచక్షణ రహితంగా కొట్టిన వైనం బయటకు వచ్చి ఇప్పుడు షాకింగ్ గా మారింది.
అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన చందానగర్ ఎస్ఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్టేషన్ ఆఫీసర్ అయిన కాస్ట్రోను బాధిత కుటుంబం సంప్రదిస్తే.. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా చేతులు దులిపేసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. బాధితురాలి కుటుంబానికి జరిగిన వరుస అన్యాయాలపై గళం విప్పిన వైనంతో.. నిందితుడి మీద ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ తో పాటు లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ మహానగర పోలీసింగ్ తీరును వేలెత్తి చూపేలా ఇటీవల వెలుగు చూస్తున్న వరుస ఉదంతాలు ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు.