అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న సంగతి తెలిసిందే. అయితే, తాను సీఎం అని….కాబట్టి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలోనే పలుమార్లు కోర్టుకు జగన్ విన్నపాలు చేసుకున్నారు. కానీ, ఆ విజ్ఞప్తిని కోర్టు పలుమార్లు తోసిపుచ్చడంతో ఫ్రైడే ఫివర్ నుంచి తప్పించుకునేందుకు జగన్ ఏవో కుంటి సాకులు వెదుకుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తుంటారు.
శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని జగన్ స్కూల్ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని గతంలో నారా లోకేశ్ కూడా ఎద్దేవా చేశారు. జగన్ కు ఫ్రైడే టెన్షన్ అని, ఆ రోజు వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో, రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనంటూ కబురు పంపుతుంటారని సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే మరోసారి జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటూ గతంలోనే హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. గతంలో ప్రతిపక్ష నేతగానే జగన్ సాక్షులను ప్రభావితం చేశారని, ఇపుడు సీఎం హోదాలో మరింత అవకాశముందని హైకోర్టుకు సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర తెలిపారు. గతంలో జగన్ చేసిన ఈ తరహా అభ్యర్థనను కోర్టులు తోసిపుచ్చాయని గుర్తు చేశారు. కాబట్టి జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని వాదించారు.