రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. స్వపక్షం నుంచి ఒడిశా టీచరమ్మ ద్రౌపదీ ముర్మూ, విపక్షం నుంచి మాజీ సివిల్ సర్వెంట్ యశ్వంత్ సిన్హా ఉన్నారు. యశ్వంత్ సిన్హాకు ఉన్న బీజేపీ మూలాల గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన కొడుకు జయంత్ సిన్హా కూడా బీజేపీలోనే ఉన్నారు. ఆయనొక్కరే మమతా దీదీ గూటికి చేరి, మోడీపై తెలివిగా నిప్పులు కక్కుతున్నారు. ఇదీ ఇవాళ్టి రాజకీయం. ఇక ఆ రోజు వెంకయ్యనాయుడు కు రాష్ట్రపతి పదవి దక్కుతుందని రాసిన, మాట్లాడిన వారిని వైసీపీ ట్రోల్ చేస్తోంది. ముఖ్యంగా మోడీ ఆంధ్రాకు వచ్చిన సందర్భంగా చెప్పిన మాటలను కూడా ట్రోల్ చేస్తోంది.
అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెచ్చే నేత ఎవరో కాదు వెంకయ్యనే అని అంటూ ఆ రోజు మోడీ చెప్పిన డైలాగ్ ను పదే పదే వినిపిస్తూ టీడీపీని ర్యాగింగ్ చేస్తోంది. అస్సలు అర్థం ఉందా ఇటువంటి ప్రతిపాదన తీసుకుని రావడానికి అంటూ కూడా ప్రశ్నిస్తోంది. పదవి అన్నది వెంకయ్యకు మాత్రమే సంబంధించిన విషయం మీరు మరీ! సానుభూతి డోసు పెంచి తెలుగు జాతికి అవమానం అని మాత్రం రాయకండి అంటూ దక్షిణాది వారిని బీజేపీ ఏ విధంగా ప్రోత్సహించిందో కూడా చెబుతోంది.
తెలుగువారికి అవమానం అని రాయడంలో ఏం అర్థం లేదని, ఎప్పటి నుంచో ఆయనకూ, మోడీకి చాలా దూరం ఉందని కూడా సీనియర్ జర్నలిస్టులు సైతం సోషల్ మీడియాలో రాస్తున్నారు.కనుక వెంకయ్యకు పదవి రానంత మాత్రాన ఇప్పుడొచ్చిన నష్టమేం లేదని, ఆయన స్థాయికి మించిన పదవి ఇప్పటికే బీజేపీ కట్టబెట్టిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రపతి బరిలో ఉన్న ద్రౌపదీ ముర్మూ అభ్యర్థిత్వం పై కూడా వైసీపీ నుంచే కాదు ఇతర బీజేపీయేతర వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. తూర్పు రాష్ట్రాలకు బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యం బాగానే ఉందని, గతంలో కూడా ఆమె ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేసినప్పుడు సమర్థీనయ ధోరణిలోనే పనిచేశారని గుర్తు చేసుకుంటూ ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది సంబంధిత నాయక గణం.