ఏపీ సీఎం జగన్, దేవాదయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ‘బుచ్చి రాంప్రసాద్’ మండిపడ్డారు.ఏపీ సీఎం జగన్ 19 నెలల పాలనలో ఏపీలో హిందూ ఆలయాలు, ఆస్తులు, విగ్రహాలు, రథాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు.దేవాలయాలపై దాడుల విషయంలో సీఎం జగన్ ఉదాసీన వైఖరి వల్లే మరిన్నిదాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో దేవాదయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు రాష్ట్రంలో ఉన్నారా లేరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులకు బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హిందూ మతాన్ని కించపరిచే చర్యలు తగవని, హిందూ ఆచారాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోందని ఆరోపించారు.రామతీర్థంలో చంద్రబాబు పర్యటనను కుట్రపూరితంగా పోలీసులు అడ్డుకున్నారని, విజయసాయిని గర్భగుడిలోకి అనుమతించిన ఆలయ అధికారులు చంద్రబాబును అనుమతించకపోవడం కక్ష పూరిత చర్య అని మండిపడ్డారు.హిందూ ఆచారాల విషయంతో వైసీపీ నేతల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొద్ది రోజుల క్రితం తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారని మండిపడ్డారు.పవిత్రమైన తిరుమల క్షేత్రంలో డ్రోన్లు ఎగురవేసి వైసీపీ నాయకులు నియమాలు ఉల్లంఘించారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ది చెబుతారని వైసీపీ నేతలను ‘బుచ్చి రాంప్రసాద్’ హెచ్చరించారు.