ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి మేలు చేసేలా.. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలను దెబ్బ కొట్టేలా ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు సినిమాలు తీసి ఎన్నికల ముంగిట విడుదలకు సిద్ధం చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాల ఉద్దేశమేంటో.. వాటి ప్రొడక్షన్ వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. ఐతే ఈ రెండు చిత్రాలకూ కోర్టు కేసులు, సెన్సార్ సమస్యలు తప్పలేదు.
అడ్డంకులను తొలగించుకుని ‘వ్యూహం’ సినిమా మార్చి 2న విడుదలైంది కానీ.. దాన్ని కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ‘శపథం’ ఈ వారం రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యలో, ఇంకేవో ఇబ్బందులో వచ్చినట్లున్నాయి. అనుకున్న ప్రకారం విడుదల కాలేదు. ఈ వారం కాకుంటే ఇంకోవారం సినిమాను రిలీజ్ చేసి మమ అనిపిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగట్లేదు.
‘శపథం’ పూర్తిగా థియేట్రికల్ రిలీజ్‌నే స్కిప్ చేసింది. ఈ సినిమాను కాస్తా వెబ్ సిరీస్‌గా మారుస్తున్నాడు వర్మ. అందులో ‘శపథం- చాప్టర్-1’ పేరుతో తొలి ఎపిసోడ్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇంతకీ ఇది రిలీజయ్యే ఓటీటీ ఏదనుకున్నారు…? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య మొదలుపెట్టిన ‘ఏపీ ఫైబర్ నెట్’. వైసీపీ అండతో నిర్మితమై.. ఇప్పుడు ప్రభుత్వం నామమాత్రంగా నడుపుతున్న ఓటీటీలో వెబ్ సిరీస్ రూపంలో రిలీజ్ కాబోతోంది ‘శపథం’.
మామూలుగా అయితే ఇందులో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లను పే పర్ వ్యూ పద్ధతిలో వీక్షించాల్సి ఉంటుంది. కానీ వర్మ సినిమాలు ఉచితంగా చూపించినా చూసే పరిస్థితి లేదు. కాబట్టి జనాలకు ఈ సిరీస్ చూపించడానికి మళ్లీ నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు. ఐతే వర్మకు నిర్మాతలు, పెట్టుబడిదారుల లాభ నష్టాలతో పనిలేదు. సినిమా రిలీజైతే తన పని పూర్తయినట్లు. అలా మమ అనిపించడానికే ఆయన చూస్తున్నట్లున్నాడు.