వర్మ .. తాను తీసే రెగ్యులర్ సినిమాలకు పూర్తిగా ఆడియన్స్ కరువైన పరిస్థితిలో రామ్ గోపాల్ వర్మ ఒక దశలో సెమీ పోర్న్ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఒక దశ దాటాక వాటిని కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన రాజకీయ నాయకుల కోసం ప్రాపగండా సినిమాలు తీసి పబ్బం గడుపుకుంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, కొండా లాంటి చిత్రాలు ఈ కోవలోనివే. కానీ ఇవేవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి.
ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా.. అధికార వైసీపీ కోసం ఆయన రెండు సినిమాలు రెడీ చేశారు. అవే.. వ్యూహం, శపథం. కోర్టు కేసుల కారణంగా ఈ రెండు చిత్రాలూ అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయాయి. అడ్డంకులను అధిగమించి ‘వ్యూహం’ మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 2న ఈ సినిమా రిలీజైంది. కానీ ఆ సినిమాను పట్టించుకున్న వాళ్లు తక్కువమంది. కనీస స్థాయిలో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు.
‘వ్యూహం’ సినిమాను థియేటర్లలో ఆడించడానికి డబ్బులు ఖర్చయ్యాయి తప్ప.. దాని ద్వారా ఆదాయమంటూ ఏమీ రాలేదు. వైసీపీ వాళ్లు కూడా ఈ చిత్రాన్ని ఓన్ చేసుకుని తమ వాళ్లతో సినిమా చూపించలేదు. ఇక వర్మ కోరుకున్నట్లు టీడీపీ, జనసేనవాళ్లు ఎగబడి సినిమా చూడటం లాంటిది అసలే జరగలేదు. ‘వ్యూహం’ ఇలా సౌండే చేయకుండా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడిక ‘శపథం’ వంతు వచ్చింది. అది ఈ శనివారం రిలీజ్ కావాలి. కానీ ఇంకా దానికి సెన్సార్ అవ్వలేదట.
ఆ క్రతువు ముగిసి అనుకున్న ప్రకారం సినిమా రిలీజ్ కావడం డౌట్‌గానే ఉంది. సెన్సార్ సమస్యలు, రిలీజ్ వాయిదా అంటే పబ్లిసిటీ ఏమైనా వస్తుందేమో అనుకుంటే అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఎప్పుడు సినిమా రిలీజైనా వాషౌట్ కావడం ఖాయం. ఈ సినిమాల కోసం వర్మ పదుల కోట్లు ఖర్చు పెట్టించాడు. ఆయనకు ముట్టాల్సింది బాగానే ముట్టింది. కానీ ఈ సినిమాలు తీసిన వారికి ఏమైనా ప్రయోజనం కలిగిందా అంటే సున్నా. పెట్టుబడి మొత్తం వృథా. రాజకీయ ప్రయోజనమూ లేకపాయె.