సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో మంత్రి పేర్ని నాని వర్సెస్ వర్మ అన్నట్లు ట్విటర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వర్మను ఈ రోజు చర్చలకు నాని ఆహ్వానించడంతో వారిద్దరూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ భేటీ తర్వాత వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నాగార్జున వ్యాఖ్యలపై, సినీ పెద్దల కామెంట్స్, లేఖలపై స్పందించేందుకు భేటీకి రాలేదని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధరలపై ఒక దర్శకుడిగా తన అభిప్రాయం చెప్పేందుకు వచ్చానని చెప్పారు.
అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్జీవీ అన్నారు. థియేటర్స్ మూసివేత పై చర్చ జరగలేదని, నానితో చర్చలు సంతృప్తినిచ్చాయని అన్నారు. 5 ముఖ్యమైన అంశాలపై నానితో చర్చించానని, తన వర్షన్ తాను చెప్పానని అన్నారు వర్మ. తనకున్న 30ఏళ్ల అనుభవంతో ఇండస్ట్రీ, థియేటర్ల విషయంలో ఎక్కడ ఏం జరుగుతుందో వివరించానని చెప్పారు.
నాని కూడా కొన్ని విషయాలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ చర్చల తర్వాత అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నట్లు వర్మ చెప్పారు. టికెట్ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని, అలా చేయడం వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని వివరించినట్లు తెలిపారు. మరి, వర్మ మీటింగ్ తర్వాత ఏపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.