ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆయనను జూన్ 6వ తేదీ వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, పోలీసుల అండదండలతోనే పిన్నెల్లి పరారయ్యారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైందని, అందుకే ఆ పార్టీ నేతలెవరూ బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అమెరికాకు వెళ్లారని, ఆయన తిరిగి వస్తారని, కానీ, లండన్ వెళ్లిన జగన్ తిరిగొస్తారో..రారో తెలీదని వర్ల రామయ్య సెటైర్లు వేశారు. జగన్ రిటర్న్ టికెట్ గురించి వైసీపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీకి 144 స్థానాలు వస్తాయని సజ్జలకు జగన్ చెప్పినట్లు తెలుస్తోందని, అబద్ధాలతో మాయ చేయాలని సజ్జల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
పోలింగ్ ముగిసినప్పటి నుంచి వైసీపీ నేతల్లో నిరాశా, నిస్పృహలు పెరిగిపోయాయని, కనపడిన వారిపై అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. వెబ్ కాస్టింగ్ హైజాక్ బటన్ల కంట్రోల్ చంద్రబాబు దగ్గర ఉందంటూ నీలి మీడియాలో బుద్ధిలేని రాతలు రాశారని, పత్రిక చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తారా? అని ప్రశ్నించారు. వెబ్ కాస్టింగ్ ను నియంత్రించేది ఎన్నికల సంఘం అన్న విషయం వైసీపీ నేతలకు తెలియదేమో అని ఎద్దేవా చేశారు.
సజ్జల అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నాడని, ఏమీ తెలియకున్నా మేధావిలా మాట్లాడుతున్నారని చురకలంటించారు. వెబ్ కాస్టింగ్ కు చంద్రబాబుకు సంబంధం ఏమిటో చెప్పాలని వైసీపీ నేతలను వర్ల రామయ్య నిలదీశారు. పోలింగ్ తీరు అర్థం కావడంతోనే వైసీపీ నేతల్లో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆరోపించారు. లోకేశ్ కే కాదని, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ వీడియో వచ్చిందని గుర్తు చేశారు.