డీజీపీ సవాంగ్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబును, టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకు పోలీస్ బాస్, డీజీపీ సవాంగ్ వైఖరి కారణమని టీడీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. తాజాగా రామతీర్థం ఘటన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ రక్షించడంతో సవాంగ్ మరోసారి విఫలమయ్యారని రుజువైందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

ప్రభుత్వ అనుమతి తీసుకొని రామతీర్థం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడాన్ని వర్ల రామయ్య ఖండించారు. చట్ట ప్రకారం ఎవరిని ఆపాలో డీజీపీకి, పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. 10 మంది పోకిరీలతో రామతీర్థం వచ్చిన కేతిగాడిని అడ్డుకోకుండా అనుమతితో వెళ్లిన ప్రతిపక్షనేతను అడ్డగిస్తారా? అని పరోక్షంగా విజయసాయిరెడ్డిని విమర్శించారు. ఢిల్లీలో పైరవీలు చేసుకునే వ్యక్తికి రామతీర్థంలో పనేమిటని మండిపడ్డారు. రామతీర్థం ఘటనలో అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారని చెప్పడానికి విజయసాయి ఎవరని, ఏపీ హోం మంత్రి, ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకే విజయసాయిరెడ్డితో రామతీర్థం ప్రోగ్రామ్ ను సవాంగ్ డిజైన్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలను అడ్డుకునే బ్లూప్రింట్ డీజీపీ దగ్గర ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు.  త్వరలో పదవీ విరమణ చేయబోతోన్న డీజీపీ ఈ తరహా వ్యవహారాలలో ఎందుకు పాలుపంచుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. డీజీపీ ప్రవర్తనే ఇలా ఉందని, కిందిస్థాయి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తారా? అని రామయ్య ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకొని సవాంగ్ కోర్టుకు పోయారని, మరోసారి కోర్టుకెళ్లి చేతులు కట్టుకొని నిలబడటానికే చంద్రబాబును అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలనుకున్నానని, కానీ పోలీస్ శాఖపై  ఉన్న గౌరవంతో ఆ పనిచేయలేకపోతున్నానని చెప్పారు. డీజీపీ తనకు తానే స్వచ్ఛందంగా తప్పుకుంటే ఆయనకే గౌరవంగా ఉంటుందని వర్ల రామయ్య హితవు పలికారు.

కాగా, గతంలో ఏపీ డీజీపీ సవాంగ్ మూడు సార్లు హైకోర్టులో హాజరయ్యారు. ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సవాంగ్ తొలిసారి హైకోర్టులో హాజరయ్యారు. విశాఖపట్టణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన వ్యవహారం నేపథ్యంలో రెండోసారి కోర్టు మెట్లెక్కారు. చంద్రబాబుకు స్థానిక పోలీసులు ఇచ్చిన నోటీసులపై వివరణ కోరుతూ డీజీపీ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వ్యవహారంలో సుమారు ఆరున్నర గంటలపాటు సవాంగ్ కోర్టులో వెయిట్ చేయాల్సి వచ్చింది.

అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింత వ్యవహారంలో సవాంగ్ మూడోసారి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తమ ముందు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.