సాధారణంగా సినీ తారలు ముందు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల అందరినీ ఆహ్వానిస్తుంటారు. కానీ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరించింది. ఈ అందాల భామ ముందు రిసెప్షన్ కానిచ్చి.. ఆ తర్వాత వివాహం చేసుకుంది.
జులై 4న చెన్నైలోని తాజ్ హోటల్ లో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ రిసెప్షన్ ఎంత అట్టహాసంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాది భాషలకు చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం వీరి రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. దీంతో జులై 2న వరలక్ష్మి, నికోలాయ్ పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజాగా తేలింది.
జులై 10న వరలక్ష్మి మరియు నికోలాయ్ వివాహం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని క్రాబి బీచ్ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య దక్షిణ భారత సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నూతన దంపతులకు నెటిజన్లు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.