దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధా టీడీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అనకాపల్లిలో ప్రచారంలో పాల్గొన్న రాధా తాజాగా చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బలిజ సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ తన దగ్గర డబ్బులు లేవు, మీడియా సహకరించడం లేదు అంటున్నారని, ఏ వ్యాపారం లేదు, ఏ సంస్థ లేదు..మీకు సంబంధించిన మీడియా సంస్థకు ప్రతి వారం ఎన్ని కోట్ల ప్రజా ధనం ఇచ్చారో తెలియజేస్తే బాగుంటుందని పరోక్షంగా సాక్షి మీడియాకు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలపై రాధా షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులులు, సింహాలు అక్కర లేదని, పులి జనం మధ్యలోకి వస్తే ప్రజలకు భయపడతారని, ఇళ్లలో దాక్కుంటారని, ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చి వారంతా రోడ్డెక్కి ఆ పులిని తరిమి తరిమి కొడతారు అంటూ పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించే నాయకుడు కావాలని రాధా అన్నారు.
అమ్మఒడి ద్వారా ఇచ్చిన డబ్బులు పని చేస్తాయని జగన్ అనుకుంటున్నారని, కానీ చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేవన్న అయోమయంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. యువత ఆకాంక్షలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రమే నెరవేర్చగలదని స్పష్టం చేశారు. ఎన్నికల రోజున ఏ బటన్ నొక్కాలో ప్రజలకు తెలుసని, ఈవీఎంలో బటన్ నొక్కి కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాధా అన్నారు.
చంద్రగిరిలో పులివర్తి నాని గెలుపు తథ్యమని రాధా ధీమా వ్యక్తం చేశారు. సర్వేల కన్నా ప్రజల మనోభావాలు ముఖ్యమని, ప్రజానాడి కూటమి విజయాన్ని ఖాయం చేస్తుందని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజల్లోకి వచ్చిన వారికంటే, నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నవారికి వారి మనోభావాలు బాగా తెలుస్తాయని చెప్పారు. గెలిచిన తర్వాత కూటమి విజయానికి సహకరించిన నేతల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని భావిస్తున్నానని రాధా అన్నారు.
అంతకుముందు జగన్ పై జరిగిన గులకరాయి దాడి వ్యవహారంపై కూడా రాధా స్పందించిన సంగతి తెలిసిందే. బెజవాడలో ఇటువంటి దొంగ దాడి, దొంగ దెబ్బ ఎవరు తీయరని రాధా అన్నారు. ఏదైనా నేరుగా చేస్తారని, ఆ దాడి బయటివారి పని అని అన్నారు.