విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బోండా ఉమలు నిలదీశారు. దీంతో, ఇరకాటంలో పడ్డ జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు, బొండా ఉమలకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లు పంపడం, ఈ రోజు విచారణకు హాజరుకావాలని పేర్కొనడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలోనే వాసిరెడ్డి పద్మ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడికి టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అనితతోపాటు తెలుగు మహిళలు ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఆ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనితతో పాటు టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలను లోపలికి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది.
పద్మకు వినతి పత్రం అందజేసేందుకు వచ్చామని, తమను కార్యాలయంలోకి అనుమతించాలని వారు కోరారు. అలా కానిపక్షంలో వాసిరెడ్డి పద్మనే బయటకు రావాలని, మహిళలపై నేరాలకు సంబంధించి వినతిపత్రం అందజేసి వెళ్లిపోతామని అనితతోపాటు తెలుగు మహిళలు చెప్పారు.
దీంతో కొందరు మహిళలను కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. వారు వాసిరెడ్డి పద్మకు వినతి పత్రం అందజేశారు. విజయవాడ ఘటనతోపాటు అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మహిళా కమిషన్ ఛాంబర్లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనితల మధ్య వాగ్వాదం జరిగింది. ‘సీఎం జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందజేయడంతో వివాదం రేగింది. ఇలాంటి ఆరోపణలు సరికాదని వాసిరెడ్డి పద్మ అనగా… ఇప్పటివరకు జరిగిన 800కు పైగా అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని అనిత ప్రశ్నించారు. దీంతో ఆ పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ చెప్పక తప్పలేదు.