జగన్ పాలనలో ఏపీలో ఓ కొత్త ట్రెండ్ మొదలైందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తన పాలనకు వ్యతిరేకంగా నిరసన చేయడాన్ని జగన్ అస్సలు తట్టుకోలేరన్న టాక్ ఉంది. అందుకే, నిరసన చేసేవారిని, ఆందోళన చేపట్టేవారిని ముందుగానే పసిగట్టి, పోలీసులను అడ్డుపెట్టుకొని అసలు నిరసనే జరగకుండా చేయడం జగన్ స్పెషాలిటీ. మామూలుగా అయితే, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేయడం వంటి కార్యక్రమాలు హింసాత్మకమైతే తప్ప పోలీసులు కఠిన చర్యలు తీసుకోరు.
కానీ, జగన్ మాత్రం తనపై వ్యతిరేకత బయటపడుతుందన్న ఉద్దేశ్యంతో ముందస్తు అరెస్టుల పేరిట ప్రతిపక్ష నేతలు మొదలు ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ ముందస్తుగా కట్టడి చేయడమే జగన్ స్ట్రాటజీ. అయితే, ఈ ప్రాసెస్ లో పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే హౌస్ అరెస్టులు చేస్తుంటారు. ఇదే కోవలో నేడు ఛలో నర్సీపట్నం కార్యక్రమం నేపథ్యంలో కూడా పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయాలని పోలీసులను జగన్ ఆదేశించారు.
యథా ప్రకారం జగన్ ఆదేశాలను తూ.చ తప్పుకుండా పాటిద్దామనుకొని వెళ్లిన పోలీసులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దిమ్మదిరిగే షాకిచ్చారు. వంగలపూడి అనితను గృహనిర్బంధం చేసేందుకు ఆమె ఇంటికి ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ వెళ్లారు. అయితే, నోటీసులు లేకుండా రావడంతో ఆమెను అనిత నిలదీశారు. అంతేకాదు, ఆ మహిళా పోలీసు యూనిఫాంకు కనీసం నేమ్ ప్లేట్ కూడా లేకపోవడాన్ని అనిత ప్రశ్నించారు.
41ఏ నోటీసులు ఉంటేనే తన ఇంటికి రావాలని, అప్పుడు గృహనిర్బంధం చేసుకోవాలని రూల్స్ ను వివరించారు. అలా కాకుండా, నిబంధనలు పాటించకుండా తన ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ అంటే కోర్టులో కేసు వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, అప్పటికప్పుడు ఆ మహిళా పోలీసుతో సంబంధిత సీఐకి ఫోన్ చేయించి ఇదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పారు. దీంతో, పోలీసులకు షాక్ తగిలినట్లయింది.
ఈ క్రమంలోనే నిబంధనలు పాటించకుండా వచ్చి గృహనిర్బంధం అనే పోలీసులను నిలదీయాలని అనిత తన ట్విటర్ ఖాతాలో పిలుపునిచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ ఆ కానిస్టేబుల్, సీఐలతో మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. దీంతో, అనిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిబంధనలకు విరుద్ధంగా తమకి ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి గృహ నిర్భంధం అనే పోలీసులను నిలదీయండి. నేమ్ ప్లేట్ లేకుండా, 41A నోటీసులు, లేదా ఇతర నోటీసులు లేకుండా ఇంట్లోకి వచ్చి అరెస్ట్ అనే పోలీసులపై ఇక నుండీ ప్రైవేట్ కేసులు వేయండి. రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకునే హక్కు పోలీసులకూ లేదు pic.twitter.com/7qyK9zRE3M
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 20, 2022