ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, సీఎం జగన్ ల పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. అన్నగా అండగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఊదరగొట్టారని అనిత విమర్శించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన జగన్ మాటతప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. మహిళల రక్షణను గాలికి వదిలేసిన జగన్ కిరాతకులు నేరస్థులకు అండగా నిలబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రోజుకు సగటున మహిళలపై 49 నేరాలు జరుగుతున్నాయంటే జగన్ పాలనలో మహిళలకు రక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందని, మహిళల రక్షణ విషయంలో జగన్ శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే కడప జిల్లా బద్వేల్లో అనూష చనిపోయిందని ఆరోపించారు. జగన్ గొప్పగా చెప్పుకునే జీరో ఎఫ్ఐఆర్ ఎందుకూ పనికి రాకుండా పోయిందని ఆరోపించారు.
ఇక రాష్ట్రంలోని మహిళలపై జరిగిన అఘాయిత్యాలలో జగన్ గొప్పగా చెప్పుకునే వాలంటీర్ల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. ఆడపిల్లల మానానికి 5 లక్షలు, ప్రాణానికి 10 లక్షలు ఖరీదు కట్టే దుస్థితిలో ఏపీ మహిళా కమిషన్, జగన్, హోంమంత్రి ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర మహిళా కమిషన్ జగన్ కమిషన్ గా మారిపోయిందని సెటైర్లు వేశారు. మహిళలకు అన్యాయం జరిగితే స్పందించని వాసిరెడ్డి పద్మ… జగన్ ఆయన సతీమణి గురించి మాట్లాడే వారిపై స్పందిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇవ్వడానికి మాత్రమే వాసిరెడ్డి పద్మకు సర్వాధికారాలు ఉంటాయా అని ప్రశ్నించారు. అలా ఉంటే జగన్ రెడ్డికి తొలి నోటీసులివ్వాలని, రెండో నోటీసు బూతుల మంత్రికి, మంత్రులకు ఇవ్వాలని అన్నారు. బూతుల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటని, జగన్ క్యాబినెట్లో బూతులు మాట్లాడని మంత్రి ఎవరన్నా ఉన్నారేమో ఆయన చెప్పగలరా అని నిలదీశారు. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సీఎం హోదాలో జగన్ రెడ్డి బూతులు మాట్లాడితే మిగతావారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారని ఎద్దేవా చేశారు.