భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం సూసైడ్ ఘటన తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవే కారణమంటూ రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. దీంతో, తన కొడుకును పోలీసులకు అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా కూడా చెప్పారు. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వనమా రాఘవ అరెస్టయ్యాడని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
అయితే, అనూహ్యంగా ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. వనమా రాఘవను తాము అరెస్ట్ చేయలేదని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ షాకింగ్ ప్రకటన చేశారు. ఏడెనిమిది పోలీసు బృందాలతో తాము రాఘవ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకడం లేదని ఏఎస్పీ చెప్పారు. రాఘవ దొరికితే తాము అరెస్ట్ చేస్తామని, గతంలో కేసుల ప్రాతిపదికన రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని వెల్లడించారు.
పరారీలో ఉన్న రాఘవ కోసం జిల్లా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయని చెప్పారు. రాఘవను అరెస్ట్ చేసేందుకు ఇతర జిల్లాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. వీలైనంత త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మరోవైపు, తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి నోటీసులు అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల్లోపు రావాలని, మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.