కేసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసినో వ్యవహారంతో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధాలున్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక, ఆ ఆరోపణల నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ కొడాలి నాని సవాల్ విసరడంతో ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరిన్ని షాకింగ్ ఆరోపణలు చేశారు.
నేపాల్ లో కేసినోను నడిపిన ప్రవీణ్ భాగోతంతో కొడాలి నానితోపాటు వల్లభనేని వంశీకి కూడా సంబంధాలున్నాయని వర్ల ఆరోపించారు. త్వరలోనే అందరి భాగోతాలను ఈడీ బయటపెడుతుందని వర్ల రామయ్య ధీమా వ్యక్తం చేశారు. జూన్ 10 నుంచి 13 తేదీల్లో నేపాల్ కు ప్రత్యేక విమానంలో వెళ్లిన వారి జాబితాను బయటపెడితే వైసీపీ ప్రభుత్వమే కూలిపోతుందని వర్ల జోస్యం చెప్పారు. కేసినో వ్యవహారాలను నడిపి వైసీపీ పెద్దలు బ్లాక్ మనీని వైట్ చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, భీమవరం, ఏలూరు నుంచి జూదగాళ్లు నేపాల్ వెళ్లేందుకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రవీణ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడని ఆరోపించారు. విమాన ఛార్జీలు, భోజనాలు, బస, అశ్లీల నృత్యాలకు ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షలు వసూలు చేశాడని, నేపాల్ కు వెళ్లిన వారిలో సగం మంది వైసీపీవాళ్లేనని ఆరోపించారు.
గుడివాడలో కొడాలి నాని నిర్వహించిన కేసినోలో వల్లభనేని వంశీ కూడా పార్ట్నర్ అని ఆరోపించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఆ క్యాసినోకు కేరళ నుంచి వందలాది మంది వచ్చారని ఆరోపించారు. గుడివాడలో వన్ సైడ్ గా జరిగిన గేమ్స్ దోపిడీతో అందరూ డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పారు. దీంతో, కేరళ జూదగాళ్లు ఈడీకి ఫిర్యాదు చేశారని, ఈ విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వం నివ్వెరపోయిందని అన్నారు. కానీ, ఏపీలో ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా సీఎం జగన్ కు మాత్రం ఏమీ తెలియదంటూ ఎద్దేవా చేశారు.
గుడివాడ కేసినోలో ఎంట్రీ టికెట్ల ద్వారా రూ. 180 కోట్లు చేతులు మారాయని, ఆ డబ్బును ప్రవీణ్ అండ్ టీం మనీ లాండరింగ్ చేసి లావోస్ లోని బ్యాంక్ ఖాతాల్లో వేశారని చెప్పారు. ఆ తర్వాత లావోస్ నుంచి ఏపీకి ఈ డబ్బు పెద్ద మొత్తంలో చేరడంతో ఆర్బీఐ ఉలిక్కిపడిందని అన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో ప్రవీణ్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి గతంలోనే టీడీపీ నేతలు వెల్లడించారని గుర్తు చేశారు. కేసినో సెగ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ సత్యానందం, విచారణాధికారి శ్రీనివాస్, కొందరు పోలీసులకు కూడా తగులుతుందని అన్నారు.
Comments 1