వచ్చే ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎమ్మెల్యేలలో భయాలు మొదలవుతున్నాయి. జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ఆయన సమర్థుడు కాదని జనం అనుకుంటున్నారని… పాలన ఆయనకు చేతకావడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సెన్స్ చేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్‌పై నమ్మకం పెట్టుకోకుండా తమ పాట్లు తాము పడాలని డిసైడవుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు అలాంటి కార్యక్రమాలే ప్రారంభించారు.
జగన్ గడపగడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని… ప్రజలకు జగన్ ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలని.. వాటితో ఆ కుటుంబాలు ఎంత లబ్ధి పొందాయో వివరించాలని చెప్పగా… ఈ కార్యక్రమాన్ని వల్లభనేని మరోరకంగా వాడుకున్నారు. జగన్ పథకాల గురించి చెప్తే అందులో లోటు పాట్లు.. అర్హుల ఎంపికలో పొరపాట్లు.. పథకాలు అందనివారి ఆగ్రహాలు అన్ని ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో ఆయన గడప గడపా తిరిగినప్పటికీ ఇవేమీ చేయకుండా తన జేబులోని సొంత డబ్బు ప్రజలకు పంచారని టాక్. నియోజకవర్గంలో తాను తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ ఆయన కోట్ల కొద్దీ డబ్బు ఇప్పటికే పంచిపెట్టారంటున్నారు అక్కడివారు.
ప్రజలను ఆ విధంగా ఎరవేసిన వంశీ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరించే వలంటీర్లు, సచివాలయాల సిబ్బందినీ సాఫ్ట్‌గా తనవైపు తిప్పుకొనే కార్యక్రమం ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలోని 82 సచివాలయాల పరిధిలో 663 సిబ్బందికి, 1781 మంది వలంటీర్లకు తన సొంతడబ్బుతో స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారట వంశీ. ఒక్కో ఫోన్ విలువ రూ. 10 వేలు ఉంటుందని.. సుమారు 2,500 మందికి ఫోన్లు ఇస్తున్నారని చెప్తున్నారు. కేవలం దీనికే ఆయన సుమారు రూ. 2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎన్నికల విధులలో ఉండబోవడం లేదు… దీంతో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఆ పనిచేస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ముందుగానే వంశీ వారిని తనవారిగా చేసుకోవడానికి ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం.
ఇంతకాలం వైసీపీ నేతలు చెప్తున్నట్లు జగన్ పేరు చెప్పుకొని, ఆయన బొమ్మ పెట్టుకుని గెలవడం ఇక సాధ్యం కాదని తెలిసే వంశీ ఎన్నికలకు ఇంతముందు నుంచే డబ్బు భారీగా ఖర్చు చేస్తున్నారట. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ జనంలోకి వెళ్లమని జగన్ చెప్తుంటే వల్లభనేని వంశీ మాత్రం తన భవిష్యత్తు కోసం సొంత ప్లాన్లు వేస్తున్నారు.